నేరాలకు పాల్పడిన ప్రజాప్రతినిధుల్ని రాజకీయాల నుంచి ఏరివేయాలన్న లక్ష్యంతో సుప్రీంకోర్టు శరవేగంగా అడుగులు వేస్తోంది. సుప్రీంకోర్టు నియమించిన అమికస్ క్యూరీ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అన్ని రాష్ట్రాల హైకోర్టుల నుంచి ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా సేకరించి.. సుప్రీంకోర్టుకు సమర్పించారు. దీనిపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ప్రజాప్రతినిధులపై దేశవ్యాప్తంగా 4859 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఏపీలో ప్రజాప్రతినిధులపై 132 కేసులు, తెలంగాణలో ప్రజాప్రతినిధులపై 143 కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపింది.
హైదరాబాద్ సీబీఐ ప్రధాన కోర్టులో ఉన్న 17 కేసుల విచారణను 9 నెలల్లో ముగించే అవకాశం ఉందని తెలంగాణ హైకోర్టు సమాచారం ఇచ్చింది. మరో 11 కేసుల్లో సీబీఐ, 5 కేసుల్లో ఈడీ చార్జ్‌షీట్ ఫైల్ చేసిందని… ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న కేసులు ప్రతి శనివారం విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టు నిర్ణయించినట్లుగా తెలిపింది. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణ, పురోగతి తెలుసుకునేందుకు.. ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటుకు తెలంగాణ హైకోర్టు నిర్ణయించింది. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టును ఆదర్శంగా తీసుకొని.. మిగలిన రాష్ట్రాల హైకోర్టులు వెబ్సైట్ రూపొందిస్తే బాగుంటుందని అమికస్ క్యూరి సుప్రీంకోర్టుకు సూచించారు. ఏపీ హైకోర్టు కూడా ప్రతి జిల్లాలో ఒక మెజిస్ట్రేట్ కోర్టుని ప్రత్యేక కోర్టు గుర్తిస్తామని తెలిపింది. విశాఖ, కడపలో సెషన్స్ స్థాయి ప్రత్యేక కోర్టుల ఏర్పాటు చేస్తామని.. ప్రాధాన్యత క్రమంలో విచారించాలా లేక సాధారణంగానే విచారించాలా.. అన్న అంశంపై స్పష్టత ఇవ్వాలని సుప్రీంని ఏపీ హైకోర్టు కోరింది.
సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో అమికస్ క్యూరీ కీలకమైన సిఫార్సులు చేశారు. సీబీఐ, ఈడీ, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థల్లోని కేసుల పురోగతిపై.. నివేదిక సమర్పించేలా కేంద్రాన్ని ఆదేశించాలని సూచించారు. ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల విచారణతో పాటు దర్యాప్తును కూడా..హైకోర్టు పర్యవేక్షించాలని … సాక్ష్యుల రక్షణ కోసం సుప్రీం గతంలో చెప్పిన సాక్షుల సంరక్షణ చట్టం 2018ని అన్ని ప్రత్యేక కోర్టులు అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. మంగళవారం ఈ అంశంపై సుప్రీంకోర్టులో కీలకమైన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.