సింగపూర్ మాత్రమే కాదు చాలా దేశాలు అంతరించిపోబోతున్నాయని టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ లో వ్యక్తం చేసిన అభిప్రాయంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇందులో ఇసుమంత కూడా అవాస్తవం లేదు. ప్రపంచంలో చాలా దేశాలు ఉనికి సమస్యల్లోఉన్నాయి. అవన్నీ ఆర్థికంగా బాగున్న దేశాలే. అంతరించిపోయే ముందు ఆర్థిక సామ్రాజ్యాలనూ కోల్పోనున్నారు. ఎందుకంటే ఆ దేశాల్లో జనాభా పుట్టడం లేదు..పెరగడం లేదు..కానీ చనిపోతున్నారు.
బేబి క్రైసిస్ గుప్పిట్లో అనేక దేశాలు
జనాభా తగ్గిపోతున్న దేశాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. జనాభానుతగ్గించుకోవడానికి చేసిన ప్రయత్నాలు వికటించి ఇప్పుడు దేశాలకు దేశాలు ఉనికిని కాపాడుకునేందుకు బలవంతంగా అయినా పిల్లల్నికనేలా చేసేందుకు పాలకులు కఠిన చర్యలు తీసుకునే పరిస్థితికి వచ్చింది. చైనాలో ఇప్పుడు పిల్లల్నికనేవారు లేరు. అక్కడి కిండర్ గార్టెన్ స్కూళ్లు వృద్దాశ్రమాలుగా మారుతున్నాయి. జర్మనీ, రష్యా,సింగపూర్, కొరియా ఇలా ఎక్కడ.. ఏ దేశంలో చూసినా జనాభాలో వృద్ధులు పెరిగిపోతున్నారు. భావిపౌరులు తగ్గిపోతున్నారు. జపాన్ మరో యాభై ఏళ్ల తర్వాత ఉండదని ఇప్పటికే లెక్కలు వేస్తున్నారు. అక్కడ ఊళ్లకు ఊళ్లు ఖాళీగా ఉంటున్నాయి.
పిల్లల్ని కనకుండా చేసినంత ఈజీ కాదు కల్లా ఒత్తిడి చేయడం
జనాభాను నియంత్రించడానికి ప్రపంచదేశాలు కొన్ని దశాబ్దాల కిందట కఠిన చర్యలు తీసుకున్నాయి. మెల్లగా ప్రజలే పిల్లలని కనడం అంటే పెనుభారంగా భావించడం ప్రారంభించారు. ఇప్పుడు జీవితం అంటే పిల్లల్ని కని వారిని పెంచడానికి సర్వశక్తులు ఒడ్డడమేనా అని ఆలోచిస్తున్నారు. అందుకే స్వచ్చంగా ఒక్క పిల్లవాడ్ని కనడానికి కూడా ఆలోచిస్తున్నారు. హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేసి పోవాలనుకుంటున్నారు . తమ వారసులు భూమి మీద ఉంటే ఏంటి.. లేకపోతే ఏంటి అనుకుంటున్నారు. ప్రభుత్వాలు పిల్లల్ని కనాలని ఒత్తిడి చేస్తున్నా ఎవరూ లెక్క చేయడం లేదు.
దేశమంటే మట్టి కాదోయ్ మనుషులోయ్
దేశమంటే మట్టి కాదు మనుషులు అని ఎప్పుడో గురజాడవారు చెప్పారు. కానీ చాలా దేశాలు తమ మట్టినే దేశంగా భావించి జనాభాను నియంత్రించుకున్నాయి. ఇప్పుడు మనుషులే లేకుండాఆ దేశాలు మిగిలిపోయే పరిస్థితి వస్తోంది. మరో యాభై ఏళ్లకు అంటే ఓ తరం మారే సరికి.. ప్రపంచం మొత్తం వృద్ధులే ఎక్కువగా ఉండనున్నారు. వారంతా రాలిపోతే ఎన్నో దేశాలు అంతరించి పోతాయి. ఇది మానవడు స్వయంగా చేసుకున్న వినాశనం.