ప్రసవమంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అనుభవమున్న డాక్టర్ల సలహాలతో డెలివరీకి వెళ్తారు. కానీ చెన్నైలో ఓ జంట మాత్రం ఆధునిక వైద్యాన్ని నమ్మకుండా… యూట్యూబ్‌ను నమ్ముకున్నారు. గర్భంతో ఉన్న భార్యకు నొప్పులు రాగానే ఆస్పత్రికి తీసుకెళ్లకుండా ఇంట్లోనే డెలివరీకి ప్రయత్నించాడు భర్త. అది వికటించింది. తీవ్ర రక్తస్రావంతో భార్య ప్రాణాలు కోల్పోయింది. కానీ బిడ్డ మాత్రం క్షేమంగా ఉంది. ఈ ఘటన ఇప్పుడు దేశం మొత్తం హాట్ టాపిక్ అయింది.
.
యూట్యూబ్ వైద్యం వెనుక భర్త కార్తీకేయన్ స్నేహితుడి సలహా ఉందని చెబుతున్నారు పోలీసులు. సహజసిద్ధమైన ఆరోగ్య పద్థతులను అనుసరించాలని చెప్పే ఈ జంట.. యూట్యూబ్ డెలివరి ఐడియా ఇచ్చారంటున్నారు. స్నేహితుడి సూచనను గుడ్డిగా నమ్మిన కార్తికేయన్ యూట్యూబ్ డెలివరీతో భార్యను పొగొట్టుకున్నాడు. గర్భం దాల్చినప్పటి నుంచే ఈ జంట హోమ్ డెలివరీకి సిద్ధమై ఉన్నట్లు చెబుతున్నారు పోలీసులు. అందుకే క్రితిక అర్బన్ ప్రైమరీ హెల్త్‌కేర్ సెంటర్లో నమోదు చేసుకోలేదని వెల్లడించారు. యూట్యూబ్ డెలివరీ వికటించడంతో కార్తీకేయన్ భార్యను హుటాహుటిగా తిర్పూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. అయితే అప్పటికే క్రితిక మరణించినట్లు చెప్పారు డాక్టర్లు.
ఈ ఘటన అటు డాక్టర్లను షాక్‌కు గురి చేసింది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మరోవైపు క్రితిక తండ్రి…. కార్తికేయన్‌పై కేసు పెట్టారు. ఓ వైపు అత్యాధునిక శాస్త్రసాంకేతికతో ముందుకు సాగుతుంటే.. అదే టెక్నాలజీని మూర్ఖంగా వినియోగించుకుంటూ ఇలా ప్రాణాలు తీసుకుంటున్నారు.