ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు అనూహ్యమైన షాక్ తగిలింది. నేరుగా కోర్టే ప్రాథమిక అదారాలు ఉన్నాయని వ్యాక్యానించింది. ఇప్పటి వరకూ ఈడీ, సీబీఐ ఆరోపణలు చేసింది. కానీ న్యాయమూర్తి ఆధారాలున్నాయని చెప్పడం మాత్రం అనూహ్యమే. స్కాం ద్వారా ఆర్జించిన లాభాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోసం ఆస్తులు కొనుగోలు చేశారనడానికి సరిపడా ఆధారాలున్నాయని రౌజ్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది.
‘‘నిధులు బదిలీ జరిగిన తీరు, ఆస్తుల క్రయవిక్రయాలు, క్రియేటివ్ డెవలపర్స్ వాంగ్మూలాలు అన్ని కూడా కవిత ఆదేశాలనుసారమే జరిగినట్లు ప్రాథమికంగా అర్థమవుతోంది’’ అని పిళ్లై బెయిల్ పిటిషన్ కొట్టేస్తూ తీర్పులో వ్యాఖ్యానించింది. పిళ్లై తన పేరిట ఆస్తులు కొనుగోలు చేయలేదని చార్జిషీటులో ప్రాథమికంగా ఈడీ పేర్కొనడాన్ని బట్టి చూస్తే కవిత కోసం బినామీ లావాదేవీకి పాల్పడినట్లు స్పష్టమవుతోందని తెలిపింది.
ఈడీ సమర్పించిన మౌఖిక, డాక్యుమెంటరీ ఆధారాల ప్రకారం ఈ కేసులో అరుణ్ పిళ్లై ప్రధాన నిందితుడని ప్రాథమికంగా రుజువు చేస్తోందని కోర్టు స్పష్టం చేసింది. 2022 ఏప్రిల్లో ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో జరిగిన విజయ్ నాయర్, కవిత మధ్య జరిగిన భేటీలోనూ ఆయన పాల్గొన్నట్లు కోర్టు గుర్తించింది. మద్యం విధానం రూపకల్పన, అమలు సమయంలో సౌత గ్రూపునకు హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లి, కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు గోరంట్ల, మద్యం వ్యాపారీ బినయ్ బాబు ప్రాతినిధ్యం వహించినట్లు ఆధారాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపింది.
కోర్టు ప్రాథమిక ఆధారాలను గుర్తించడం కవితకు ఓ రకంగా షాక్ లాంటిదేనని భావిస్తున్నారు. దర్యాప్తు సంస్థలు .. చాలా రోజులుగా ఆమె విషయంలో సైలెంట్ గా ఉంటున్నాయి. కానీ న్యాయస్థానాల్లో మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.