ధూళిపాళ్ల నరేంద్రను జైల్లో పెట్టాలన్న లక్ష్యంతోనే ఏసీబీ పోలీసులు ఉన్నారని విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో… ఏసీబీ కోర్టు పోలీసులు అదే ఉద్దేశంతో ఉన్నారన్నట్లుగా చీవాట్లు పెట్టింది. జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న నరేంద్రను తమకు తెలియకుండా ఎందుకు జైలుకు తీసుకెళ్లారని సూటిగా ప్రశ్నించింది. వీటికి సమాధానం చెప్పలేక ప్రభుత్వ న్యాయవాది నీళ్లు నమలాల్సి వచ్చింది. ధూళిపాళ్ల నరేంద్రను సంగం డెయిరీలో అక్రమాలంటూ అరెస్ట్ చేశారు. అటూ ఇటూ తిప్పడంతో ఆయనకు కరోనా సోకింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు ఆస్పత్రిలో చేర్చించారు. రెండు రోజుల కిందట టెస్ట్ చేయడంతో నెగెటివ్ వచ్చింది.
వారం రోజులు ఐసోలేషన్లో ఉండాలని డాక్టర్ సూచించారు. అయినప్పటికీ పోలీసులు కొంపలు మునిగిపోతున్నాయన్నట్లుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. దీంతో నరేంద్ర తరపు న్యాయవాది ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. కోర్టు అనుమతి తీసుకోకుండా.. జైలుకు తరలించారని వాదించారు. వాదనల సమయంలో ఏసీబీ తీరుపై న్యాయమూర్తి తీవ్రంగా మండిపడ్డారు. జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న నరేంద్రను కోర్టుకు తెలియకుండా రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఎలా తరలిస్తారని నిలదీశారు. ధూళిపాళ్లను వారం రోజులు ఐసోలేషన్లో ఉంచాలని వైద్యులు చెప్పినా ఆయనను జైలుకు ఎలా తరలించారని మండిపడింది.
వెంటనే ధూళిపాళ్లను రాజమండ్రి ప్రైవేట్ ఆస్పత్రిలో లేదా.. విజయవాడ ఆయూష్ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది. కొవిడ్ వచ్చిన వారు 14 రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని తెలిపినా.. ధూళిపాళ్లను ఎలా తరలిస్తారని కోర్టు ప్రశ్నించడంతో పోలీసులు తలెత్తుకోలేకపోయారు. ఈసారి కోర్టు అనుమతి లేకుండా తీసుకెళ్లొద్దని న్యాయమూర్తి ఆదేశించారు. ధూళిపాళ్ల నరేంద్రపై రాజకీయ కోపంతో.. కొన్నాళ్లు అయినా ఆయనను జైల్లో పెట్టాలన్న లక్ష్యంతోనే రాజకీయ ప్రేరేపిత కేసు అని టీడీపీ నేతలు విమర్శిస్తున్న సమయంలో.. ఏసీబీ కోర్టు స్పందన కూడా అలాగే ఉండటం… ఏసీబీ పోలీసుల ఇజ్జత్ తీసేసినట్లయింది.