ఏపీసీఐడీకి కోర్టు జారీ చేసిన షోకాజ్ నోటీసులు ఇప్పుడు పోలీసు వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. జర్నలిస్ట్ అంకబాబును అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా కోర్టులో పచ్చి అబద్దాలు ఆడారు. ఇప్పుడు న్యాయస్థానం వాటికి సంబంధించి ఆధారాలు చూపించాలని ఆదేశించింది. నాలుగు రోజుల్లో సమాధానం చెప్పాలని షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఇప్పుడీ కేసులో అంకబాబును అరెస్ట్ చేసి తీసుకొచ్చిన ఎనిమది మంది పోలీసులు మాత్రమే కాదు ఈ వ్యవహారంలో ఆదేశాలిచ్చిన వారితో సహా సీఐడీ చీఫ్ వరకూ బాధ్యత వహించాల్సి ఉంటుంది.
కోర్టులో జరిగిన వాదనల్లో సీఐడీ తాము నోటీసులు ఇచ్చినా అంకబాబు తీసుకోలేదని అందుకే అరెస్ట్ చేశామని తెలిపారు. అయితే అంకబాబు పోలీసులు తన ఇంటికి వచ్చినప్పటి నుండి సీఐడీ అఫీసుకు తీసుకెళ్లే వరకూ ప్రతీ దృశ్యాన్ని వీడియోగా చిత్రీకరించారని ..తనకు నోటీసులు ఇచ్చారో లేదో అవి చూస్తే తెలిసిపోతుందని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమయంలో తన ఎదుట నోటీసులు ఇవ్వాలని సీఐడీని న్యాయమూర్తి ఆదేశించారు. కానీ సీఐడీ అలా ఇవ్వలేమని చెప్పింది. జడ్జి ఎదుటే నోటీసులు ఇవ్వడానికి సిద్ధపడని సీఐడీ నిజంగా ఇచ్చిందంటే ఎవరు నమ్ముతారు ?
సీఐడీ ప్రైవేటు సైన్యంల మారి ఇప్పటికి ఎంతో మందిని అరెస్ట్ చేసింది. అందరిపై సోషల్ మీడియా పోస్టుల ద్వారా విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్న కేసులు పెడుతారు. భావ ప్రకటనా స్వేచ్చను పట్టించుకోరు. ఏపీ సీఐడీ కేవలం రాజకీయంగా వైసీపీ పార్టీకి సేవ చేయడానికి ఆ పార్టీ ప్రత్యర్థుల్ని వేటాడటానికి ఉపయోగించుకుంటున్నట్లుగా చాలా రోజులుగా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు దిగువ కోర్టు ఇచ్చిన నోటీసుల తరవాత ఆ వ్యవహారాలన్నింటనీ న్యాయస్థానాల ముందు పెట్టే ఆలోచనలో టీడీపీ నేతలున్నారు. అయితే ఎలాగోలా ఈ వ్యవహారంలో ఒకరిద్దర్ని బలి చేసి.. విషయం పెద్దది కాకుండా చూసుకునే ప్రయత్నంలో కొంత మంది ఉన్నట్లుగా తెలుస్తోంది.