న్యాయ వ్యవస్థకు ఎన్నో ప్రత్యేకతలను కల్పించింది మన రాజ్యాంగం. కానీ చట్టాన్ని చుట్టంగా చేసుకోవడం మన నాయకులకు వెన్నతో పెట్టిన విద్యేగా. ఆ ఒక్క విషయంలోనే ప్రపంచదేశాల్లో ఉన్న అందరు నాయకులకంటే కూడా మన నాయకులు ఒక మెట్టుపైనే నిలుస్తారు. ఆ విషయం పక్కన పెడితే ఈ మధ్య వస్తున్న కొన్ని కోర్టు తీర్పులు అన్నీ రాజకీయ నాయకుల మాటల్లానే ఉంటున్నాయి. గ్యాస్ సబ్సిడీని వదులుకోమని చెప్పి ప్రజలకు అప్పీల్ చేసే నాయకులు..పార్లమెంట్ క్యాంటీన్లో సబ్సిడీ రేట్ల విధానాన్ని మాత్రం వదులుకోలేరు. అలాగే ఛాన్స్ దొరికినప్పుడల్లా వాళ్ళ జీతాలు, సౌకర్యాలు పెంచుకుంటూ ఉంటారు. అలా వాళ్ళు అనుభవిస్తున్న ఆనందాలన్నీ ప్రజల కష్టార్జితాన్ని కప్పంగా కట్టించుకుని కొట్టేస్తున్న డబ్బుతోనే అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో పేద ప్రజలకోసమే ఉన్నామని చెప్పుకునే కమ్యూనిస్టులు కూడా తక్కువేం కాదు. రోజు రోజుకూ ప్రజాప్రతినిధులకు ఉండే ప్రత్యేక హోదాలు పెరుగుతూ పోతున్నాయి. వాళ్ళ సెలబ్రిటీ స్టేటస్ ఖర్చు భారం కూడా దేశం మోయలేనంత స్థాయికి చేరుకుంటోంది. ఈ విషయం గురించి మాత్రం దేశంలో ఉన్న ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడడు. అలా ఉంటుంది మన నాయకులు చేసే రాజకీయం.
ఇప్పుడు కోర్టుల వ్యవహారం కూడా అలానే ఉంటోంది. సినిమా ప్రారంభానికి ముందు జాతీయగీతాన్ని వినిపించాలి అని తీర్పులిచ్చే కోర్టులు…..మరి కోర్టుల్లో కూడా అదే జాతీయ గీతాన్ని ఆలపించేలా ఎందుకు తీర్పులు చెప్పరు అంటే సరైన సమాధానం చెప్పరు. పైగా ఆ విషయాన్ని ఇష్యూ చెయ్యొద్దంటారు. తాజాగా కామెడీ షో జబర్ధస్త్ విషయంలో కోర్టు తీర్పు కూడా అలానే ఉంది. దేశంలో కోర్టుల పనితీరు గురించి అవగాహనలేని ప్రజలు చాలా మంది ఉన్నారట. అందుకని కామెడీ షో పేరు చెప్పి కోర్టుల పనితీరును, జడ్జ్‌లను, లాయర్లను కామెడీ చేస్తే న్యాయవ్యవస్థ గౌరవం తగ్గిపోతుందట. ఈ తీర్పు బాగానే ఉంది. మరి ఈ గౌరవం తగ్గడమనేది ఒక్క న్యాయవ్యవస్థకేనా? అదే జబర్ధస్త్ షోలో మహిళల గురించి ఎంతటి హీనమైన మాటలు వినిపిస్తాయో తెలియదా? మరీ ముఖ్యంగా భార్య అంటేనే పరాయి మగాడి కోసం పరుగెత్తే వ్యక్తి అని చెప్పి తొంభైశాతం పైగా స్కిట్లలో చెప్తూ ఉన్నారే….మరి వాళ్ళ గౌరవానికి భంగం కలగదా? అలాగే పోలీస్, జర్నలిస్ట్, డాక్టర్….ఇలా సమాజంలో ఉన్న అన్ని వృత్తుల వాళ్ళను ఎటకారం చేస్తూ ఉంటారుగా…మరి వాళ్ళందరి గౌరవానికి భంగం కలగదా? మనిషి ఆలోచనల్లో లేకపోతే అస్తిత్వమే లేని కులాన్నో, మతాన్నో ఎటకారం చేస్తే తప్ప ఈ సంఘాల మనోభావాలు దెబ్బతినవు. కులానికో, మతానికో సంబంధించిన ఇష్యూ అయితే తప్ప మనవాళ్ళు ఆవేశంగా స్పందించరు. అందుకే కులాలు, మతాలతో కామెడీ చేయడం మానేశారు. కానీ మహిళలు, వృద్ధులు, పిల్లలు అనే తేడా లేకుండా అందరి విషయంలోనూ బూతుపురాణాలు వినిపిస్తూ ఉండడం అంటే వాళ్ళ గౌరవానికి భంగం కలిగించినట్టు కాదా? కామెడీ అని అనుకుంటే అంతా కూడా లైట్ తీసుకోవాలి. అలా కాకపోతే ఇంటిల్లిపాదీ చూసే అవకాశం ఉన్న బుల్లితెరపైన వచ్చే కార్యక్రమాల విషయంలో కూడా నియమనిబంధనలు కఠినంగా ఉండేలా చూడాలి. అంతేకానీ కోర్టుల, జడ్జ్‌లు, లాయర్లపైన సెటైరికల్ కామెడీ చెయ్యొద్దు….అని వాళ్ళ వరకూ వాళ్ళు తీర్పు చెప్పేసుకోవడం ఏంటి?