ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు రూ. 350 కోట్లను.. ఏపీ అకౌంట్లో వేసి మరీ వెనక్కి తీసుకున్నారు. దీన్ని చంద్రబాబు ఢిల్లీ స్థాయిలో ప్రచారం చేసి… ఇంత కంటే దారుణమైన వివక్ష బ్రిటిష్ కాలంలో కూడా ఉండదని విమర్శలు చేసుకొచ్చారు. యూసీలు ఇవ్వలేదని.. అందుకే.. వెనక్కి తీసుకున్నామని.. పార్టీ కార్యక్రమాల్లో ప్రధాని మోడీ నుంచి ఎమ్మెల్సీ సోము వీర్రాజు వరకూ చెబుతూ ఉంటారు. మరో వైపు ఈ యూసీలను.. పర్యవేక్షించే నీతిఆయోగ్.. అన్ని బాగున్నాయని… ఏపీకి నిధులివ్వాలని సిఫార్సు చేసినట్లు ఏపీకి లేఖలు రాస్తూ ఉంటుంది. బీజేపీ అధికారంలో ఒకలా.. రాజకీయంలో మరొకలా మాట్లాడుతూ.. వెనుకబడిన జిల్లాల నిధులను మాత్రం.. ఇప్పటికీ ఇవ్వలేదు. దీనిపై కోర్టులో పిటిషన్లు వేసినా… ఎందుకు ఆపారో మాత్రం సమాధానం చెప్పడం లేదు.
వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 2017 – 18 సంవత్సరానికి గాను రూ. 350 కోట్ల రూపాయలను విడుదల చేసింది. గత ఏడాది ఫిబ్రవరి 9వ తేదిన రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్ లో 350 కోట్ల రూపాయలు జమ చేసి, అదే నెల ఫిబ్రవరి 15వ తేదిన వెనక్కి తీసుకుంది. కానీ ఏపీకి సమాచారం ఇవ్వలేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్రాన్ని అభ్యర్ధించినా ఫలితం లేకుండా పోయింది. పార్లమెంట్లో అడిగితే త్వరలోనే విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు… బయట మాత్రం రాజకీయ విమర్శలు చేస్తున్నారు. దీనిపై ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేత కొణతాల రామకృష్ణ ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ వేశారు. నిధులు ఎందుకు నిలిపివేశారో చెప్పాలని కోరారు. పిటిషన్ను విచారించిన హైకోర్టు వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. కానీ కేంద్రం మాత్రం నీళ్లు నములుతోంది. సమయం కావాలంటూ.. కోర్టును కోరుతోంది.
కేంద్ర ప్రభుత్వం తరుపున హైకోర్టుకు అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ ఎమ్. కృష్ణమోహన్ హాజరై.. తమకు మరికొంత సమయం కావాలని ధర్మాసనాన్ని అభ్యర్ధించారు. కేంద్రం నుంచి మరిన్ని వివరాలు రావాల్సి ఉందని, తనకు మూడు వారాలు గడువు కావాలని హై కోర్టును అభ్యర్ధించారు. కేంద్ర వాదనపై కొణతాల తరుపు న్యాయవాది తీవ్ర అభ్యంతరం తెలిపారు. కావాలనే ఆలస్యం చేస్తోందని వాదించారు. ఏపీ నష్టపోతుందన్నారు. ఫిబ్రవరి ఏడో తేదీ లోపు కారణాలు చెప్పాలని.. ధర్మాసనం… కేంద్రాన్ని ఆదేశించింది. యూసీలు ఇవ్వకపోతే.. కేంద్రం కోర్టుకు అదే చెప్పొచ్చు కదా.. అన్న ప్రశ్న రాజకీయవర్గాల్లో వస్తోంది. రాజకీయ కక్షసాధింపు కోసమే నిధులు నిలిపివేసినట్లు.. కోర్టు సాక్షిగా బయటపడుతుందనే ఆందోళన కేంద్రంలో వ్యక్తమవుతోందని టీడీపీ నేతలు అంటున్నారు.