ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.. ఫిబ్రవరిలో ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష చేశారు. ఈ ధర్మపోరాట దీక్షకు.. ప్రభుత్వం నుంచి రూ. పది కోట్లు ఖర్చు పెట్టారంటూ.., కొద్ది రోజులు ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇప్పుడు… అదే అంశంపై.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సూర్యనారాయణరాజు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ ప్రారంభించిన హైకోర్టు… పార్టీ తరపున చేసిన ధర్మపోరాటంపై.. రూ. పది కోట్ల ప్రజాధనం వ్యయం చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఈ జీవోను జారీ చేసిన అధికారి ఎవరో చెప్పాలని.. ఏ నిబంధనల మేరకు జీవో విడుదల చేశారో చెప్పాని.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ధర్నాకు ఇంత భారీ స్థాయిలో ఎలా ఖర్చు చేశారని ప్రశ్నించింది. విచారణను వచ్చే నెల 21కి వాయిదా వేశారు.
తెలుగుదేశం పార్టీ .. బీజేపీతో కటీఫ్ చెప్పిన తర్వాత ప్రతీ జిల్లాలోనూ ధర్మపోరాట దీక్షలు చేసింది. దానిపై.. అప్పట్లోనే బీజేపీ , వైసీపీ తీవ్ర విమర్శలు చేశాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని.. కోట్లు ఖర్చు పెట్టి… రాజకీయ దీక్షలు చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. అయితే.. టీడీపీ ఆ ధర్మపోరాట దీక్షలన్నీ… పార్టీ పరంగా చేసుకుంటున్నవేనని… ప్రభుత్వ ఖర్చుతో ఎలా చేస్తామని వాదిస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఢిల్లీ ధర్మపోరాట దీక్ష కోసం చేసిన ఖర్చుపై.. హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఢిల్లీ ధర్మపోరాట దీక్ష ఖర్చుపై పూర్తి రికార్డులు ఇప్పుడు ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించాల్సి ఉంది.
మీడియాలో వస్తున్నట్లుగా.. ధర్మపోరాట దీక్షలకు ప్రభుత్వం తరపున ఖర్చు చేసి ఉంటే… టీడీపీ అధినేత చిక్కుల్లో పడిపోతారు. పార్టీ పరంగా నిర్వహించుకుని ఉంటే జగన్ మీడియాతో పాటు.. బీజేపీ నేతలు కూడా … తప్పుడు ప్రచారం చేసినట్లుగా కోర్టు సాక్షిగా బయటపడుతుంది. హైకోర్టు విచారణలో అసలు విషయం తేలిపోతుందని సామాన్య ప్రజలు భావిస్తున్నారు.