వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డిని సోమవారం వరకూ అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. అలాగే కేసు పూర్తి వివరాల ఫైల్‌ను తమ ముందు ఉంచాలని ఆదేశించంది. కేసు విచారణలో భాగంగా సేకరించిన ఆడియో, వీడియో గ్రీఫీలను హార్డ్ డిస్క్ రూపంలో తమ ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. అయితే మంగళవారం అవినాష్ రెడ్డి సీబీఐ కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.
తనపై తీవ్ర చర్యలు తీసుకోకుండా సీబీఐకి ఆదేశాలివ్వాలని అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి తరపు లాయర్ ఈ హత్య కేసులో సీబీఐ ఏకపక్షంగా విచారణ జరుపుతోందని వాదిచారు. రెండు దఫాలుగా అవినాష్ రెడ్డి నుంచి తీసుకున్న స్టేట్మెంట్ను పరిగణలోకి తీసుకోవద్దని కోర్టుకు ఆయన తరుపు న్యాయవాది తెలిపారు. 40 నుంచి 50 సార్లు అవినాష్ రెడ్డి స్టేట్మెంట్ను సీబీఐ ఎస్పీ రాంసింగ్ ఎడిట్ చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వివేకా హత్య కేసులో అసలు నేరస్థుడు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డినే అని పేర్కొన్నారు.
అవినాష్ రెడ్డి దాఖలు చేసిన రిట్లో వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత రెడ్డి ఇంప్లీడ్ అయ్యారు. తనపై వ్యక్తిగతంగా కూడా ఆరోపణలు చేసినందున తమ వాదనలు వినాలని కోర్టును ఆభ్యర్థించారు. మరో వైపు ఈ కేసు విచారణ కోసం సీబీఐ ఆఫీసుకు ఉదయమే అవినాష్ రెడ్డి హాజరయ్యారు. మూడో సారి విచారణకు హాజరు కావడంతో అరెస్ట్ చేస్తారేమోనన్న ఉద్దేశంతో పులివెందుల నుంచి పెద్ద ఎత్తున అవినాష్ రెడ్డి అనుచరులు తరలి వచ్చారు.