రఘురామకృష్ణరాజుపై 2019లో నమోదైన కేసులో సీబీఐ 2021 ముగియకుండానే చార్జిషీట్ దాఖలు చేసింది. ఇక విచారణ ప్రక్రియ పూర్తయితే రఘురామకు శిక్ష పడే చాన్స్ ఉంటుంది. రఘురామ కృష్ణరాజు ఇండ్ భారత్ పేరుతో విద్యుత్ కంపెనీలు పెట్టి… వాటి కోసం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌తో పాటు బ్యాంకుల కన్సార్షియం వద్ద రుణాలు తీసుకున్నారు. కానీ విద్యుత్ ప్రాజెక్టులు కట్టలేదు. రుణాలు దారి మళ్లించారు. ఈ కారణాలతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో కేసులు నమోదయ్యాయి. ఆయన ఇంటిపై గత ఎన్నికలకు ముందే సీబీఐఅధికారులు దాడులు చేశారు. ఇప్పుడు అది చార్జి షీట్ దాకా వచ్చింది.
ఈ రుణం ఎగవేత వ్యవహారాన్ని వీలైనంత వరకూ సాగదీయడానికి రఘురామ కంపెనీ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను కూడా ఆశ్రయించింది. అయితే ఎన్సీఎల్టీలో ఇండ్ భారత్ థర్మల్ పవర్‌కు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది.బ్యాంకుల కన్షార్షియానికి రూ.1,383 కోట్లకు పైగా బాకీ పడినట్లుగా తేలింది. కొన్నాళ్లుగా బకాయిలు చెల్లించకపోవటంతో ఎన్పీఏగా బ్యాంకులు పేర్కొన్నాయి. దివాలా ప్రక్రియ చేపట్టాలంటూ ఎన్సీఎల్టీని ఆశ్రయించింది.. బ్యాంకుల కన్సార్షియంలో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్.
అయితే దివాలా ప్రక్రియకు అనుమతించవద్దంటూ రఘురామ కంపెనీ వాదించింది. ఆ వాదనను తిరస్కరించిన న్యాయమూర్తి; దివాలా ప్రక్రియను ప్రారంభించేందుకు అనుమతించారు. దివాలా పరిష్కార నిపుణుడ్ని నియమించారు. మూడు రోజుల్లో దివాలా పక్రక్రియ గడువుతో సహా వివరాలన్నీ తెలియజేయాలని ఆదేశించారు. ఇదే కేసులు సీబీఐ చార్జిషీటు కూడా దాఖలు చేయడంతో రఘురామకు కష్టాలు రెట్టింపుయినట్లయింది.