ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి కోర్టు పర్మిషన్ తీసుకుని విదేశీ పర్యటనకు వెళ్తూండటంతో.. రాజకీయ విమర్శలకు కారణం అవుతోంది. ఒకటో తేదీన జెరూసలెం పర్యటనకు కుటుంబసభ్యులతో కలిసి వెళ్తున్న జగన్… నాలుగు రోజుల తర్వాత తిరిగి వచ్చి.. పదిహేనో తేదీ తర్వాత మళ్లీ అమెరికా వెళ్తారు. ఈ పర్యటనలకు… అనుమతి కావాలని..సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. వాస్తవానికి.. జగన్ పాస్ పోర్టు… కోర్టు అధీనంలోనే ఉంది. అక్రమాస్తుల కేసులో ఆయన బెయిల్ పై ఉన్నారు. బెయిల్ షరతుల్లో భాగంగా.. ఆయన విదేశాలకు వెళ్లాలంటే.. కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. ఎక్కడికి వెళ్తున్నారో సీబీఐకి ముందుగా చెప్పాలి. కాంటాక్ట్ నెంబర్లు ఇవ్వాలి.
అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి.. అధికారికంగా.. ప్రోటోకాల్ ప్రకారం… డిప్లమాటిక్ పాస్ పోర్ట్ తీసుకునే అవకాశం లభించింది. దాన్ని ఆయన తీసుకున్నారు. అయితే.. ఇక కోర్టు పర్మిషన్ అక్కర్లేదా.. అన్న అనుమానం చాలా మందిలో కలిగింది. అయితే.. డిప్లమాటిక్ పాస్ పోర్టుతో.. చాలా దేశాలకు వీసా తీసుకోకుండా.. నేరుగా వెళ్లిపోవచ్చు కానీ.. ఇండియా నుంచి.. ఆయా దేశాలకు వెళ్లాలంటే.. కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సిందేనని… తాజాగా తేలిపోయింది. దీంతో పాటు.. సెర్బియాలో అరెస్టయిన నిమ్మగడ్డ ప్రసాద్ ను విడిపించేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలపై .. టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్‌పై సీఎం జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు. వాన్‌పిక్ కుంభకోణంలో వాస్తవాలను ప్రజలకు వెల్లడించి .. నిమ్మగడ్డతో తన వ్యాపార లావాదేవీలను జగన్ బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
మిమ్మల్ని గెలిపించింది రాష్ట్రానికి ప్రయోజనాల కోసమా…సహ నిందితుల్ని కాపాడటానికా అని ప్రశ్నించారు. అంతర్జాతీయంగా అవినీతి కేసులలో జగన్ పేరు మార్మోగుతోందని మండిపడ్డారు. విజయసాయిరెడ్డి కి కూడా.. రూ. రెండు లక్షల పూచికత్తతో.. వివిధ రాష్ట్రాలు తిరిగి రావడావికి కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఇలాంటి వారంతా.. నీతులు చెబుతున్నారని.. టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.