బిగ్బాస్ రియాల్టీ షో ఇండియాలో మొదలైనప్పటి నుండి దీనిపై వివాదం నడుస్తూనే వుంది. ఇలాంటి చెత్త షోలని టీవీలో ప్రసారం చేయడానికి ప్రభుత్వాలు ఎలా అనుమతిస్తున్నాయని ఒక వర్గం రగిలిపోతుంది. సిపిఐ నేత నారాయణ అయితే బిగ్బాస్ ని ఒక బ్రోతల్ హౌస్ తో పోల్చి విరుచుకుపడుతుంటారు. తాజాగా హింస, అశ్లీలం, అసభ్యతను ప్రోత్సహించేలా ఉన్న బిగ్బాస్ షోని నిలిపివేయాలంటూ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ దుప్పల వెంకటరమణతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి సంచలన వ్యాఖ్యలు చేసింది.
సెన్సార్ లేకుండా ప్రసారమవుతున్న బిగ్ బాస్ షో ద్వారా నిర్వాహకులు సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించింది. ఇలాంటి షోలకు అడ్డుకట్ట వేసే విషయంలో చట్టం తెచ్చే ఉద్దేశం ఉందా లేదా చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బిగ్బాస్ వంటి ప్రదర్శనల వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ.. కేంద్ర హోం, సమాచార ప్రసార, మహిళ శిశు సంక్షేమ శాఖలతోపాటు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ తదితరులకు నోటీసులిచ్చింది. గతంలో ఈ షోపై కోర్టులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కానీ ప్రభుత్వాలు నుండి దీనిపై ఎలాంటి చర్యలు రాలేదు. మరి కోర్టు ఇచ్చిన తాజా నోటీసులపై ప్రభుత్వం స్పందన ఎలా వుంటుందో చూడాలి.