చట్టంలోని కొన్ని లొసుగుల్ని ఆధారంగా చేసుకొని, అమాయకుల్ని న్యాయస్థానంలో దోషులుగా నిలబెడుతున్నారు కొంతమంది. కేసులూ, అందులో సెక్షన్లూ అర్థం కాక నిర్దోషులు సైతం శిక్షను అనుభవిస్తున్నారు. ఇలాంటి వ్యథలు ఎన్నో. నాని నిర్మాతగా రూపుదిద్దుకొన్న ‘కోర్ట్’ కూడా ఇలాంటి కథే. ప్రియదర్శి కీలక పాత్ర పోషించిన సినిమా ఇది. ఈనెల 14న విడుదల అవుతోంది. ఈరోజు ట్రైలర్ వదిలారు.
ఫోక్సో చట్టం చుట్టూ తిరిగే కథ ఇది. మైనర్ బాలికలపై అత్యాచారం జరిపిన వాళ్లపై ఈ సెక్షన్ ప్రయోగిస్తారు. జానీ మాస్టర్ ఉదంతం తరవాత ఈ చట్టంపై అవగాహన వచ్చింది. ఇప్పుడు ఇదే సెక్షన్‌పై సినిమా తీశారు. ఓ అమాయకుడ్ని ఫోక్సో చట్టం క్రింద జైలుకు పంపడం, బెయిలు కూడా రాకుండా నెలల పాటు ఆ జైల్లోనే మగ్గిపోవడం, అతన్ని బయటకు తీసుకురావడానికి ఓ న్యాయవాది చేసే పోరాటమే ఈ కథ. ట్రైలర్లోనే కథ మొత్తం అర్థమైపోతోంంది. ఎమోషన్స్ ఏ స్థాయిలో ఉన్నాయన్న సంగతి ప్రతీ ఫ్రేమూ చెబుతోంది. నటీనటుల ఎంపిక కూడా బాగుంది. శివాజీ, హర్షవర్థన్ కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా శివాజీ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతోందన్న సంగతి అర్థమవుతోంది. కోర్ట్ రూమ్ డ్రామాలు సక్సెస్ అవ్వడం కొత్త విషయం ఏమీ కాదు. కథలో విషయం ఉంటే… ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించే సత్తా ఉన్న జోనర్ ఇది. నిర్మాతగా నాని టేస్ట్ ఏమిటో అందరికీ తెలిసిందే. కొత్త తరహా కథల్ని ఎంచుకొని సినిమాలు తీస్తున్నాడు నాని. ఆ దారిలో విజయాలూ అందుకొంటున్నాడు. మరి `కోర్ట్` ఎలాంటి ఫలితం అందిస్తుందో చూడాలి.