ఐపీఎస్ బదిలీలపై తీర్పు వాయిదా..! ఐబీ చీఫ్ కోసమే ప్రభుత్వం ఎందుకు పట్టుబడుతోంది..? ఐపీఎస్‌ల బదిలీలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 28A పరిధిలోకి రాని అధికారులపై.. ఈసీ చర్యలు తీసుకోవడాన్ని ఏపీ ప్రభుత్వం సవాలు చేసింది. ఇలాంటి అంశాలపై గతంలో కేరళ, మద్రాసు హైకోర్టులు గతంలో ఇచ్చిన తీర్పులను అడ్వకేట్ జనరల్ ఉదహరించారు.
ఐపీఎస్ అధికారుల బదిలీల వ్యవహారంలో .. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుందని ఈసీ తరపు న్యాయవాది ప్రశ్నించారు. ముగ్గురు ఐపీఎస్ అధికారుల బదిలీల్లో..
ఒకరి బదిలీ రద్దు చేస్తూ జీవో 720 తెచ్చారని ఈసీ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఎన్నికల ప్రక్రియ మొదలు కాగానే సెక్షన్ 28A పరిధిలోకి వచ్చే.. అధికారుల జాబితాలో డీజీ పేరు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని ఈసీ లాయర్ కోర్టుకు తెలిపారు. అయితే.. ఇంటెలిజెన్స్ డీజీ పేరు పొరపాటున ఇచ్చామన్న అడ్వొకేట్ జనరల్ కోర్టుకు చెప్పారు.
ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తే .. డీజీ విషయంలోనే అభ్యంతరం ఎందుకని ఈసీ తరపు లాయర్ వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.
ఇప్పటికే.. ఎన్నికల సంఘం చేసిన బదిలీల్లో.. ఇంటలిజెన్స్ చీఫ్ మినహా.. మిగతా ఇద్దరు ఎస్పీలను.. రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. శ్రీకాకుళం, కడప ఎస్పీలుగా .. కొత్త వారిని నియమించారు. ఆయా జిల్లాల ఎస్పీలను.. హెడ్ క్వార్టర్‌కు ఎటాచ్ చేశారు. వారికి ఇక ఎన్నికల విధులు అప్పగించరు. అయితే.. ఆ ఎస్పీలిద్దరూ.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. నేరుగా ఈసీకే లేఖ రాశారు. తమపై చర్యలు తీసుకోవడానికి కారణం ఏమిటని.. ప్రశ్నించారు. తాము చేసిన తప్పేమిటో చెప్పాలన్నారు. ఒక వేళ.. వైసీపీ నేత విజయసాయిరెడ్డి చేసిన ఫిర్యాదు మేరకే.. తమపై చర్యలు తీసుకుని.. ఉంటే.. ఉన్న పళంగా.. వాటిపై విచారణ జరిపి.. తప్పు చేసినట్లు తేలితే శిక్షించాలని కోరారు. లేకపోతే.. ఫిర్యాదు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని లేఖల్లో డిమాండ్ చేశారు. దీనిపై ఈసీ ఇంత వరకూ స్పందించలేదు.
ఎన్నికలు దగ్గర పడే కొద్దీ.. తెలుగుదేశం పార్టీపై ముప్పేట దాడి పెరుగుతోంది. ఓ వైపు ఐటీ దాడులు.. మరో వైపు.. ఈసీ నిర్ణయాలు.. ఇలా వరుసగా.. టీడీపీని కట్టడి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్న అభిప్రాయాలు టీడీపీలోనే వ్యక్తం అవుతున్నాయి. ఇంటలిజెన్స్ చీఫ్ కు..సీఎం సెక్యూరిటీ విషయంలో స్పష్టమైన అవగాహన ఉంటుందని.. ప్రతిపక్ష నేత వ్యవహారశైలి.. ఆయన గతంలో .. చంద్రబాబును కాల్చి చంపాలి.. అనే మాటలు మాట్లాడి ఉండటం… ఆయన ఇమేజ్ కు దానికి తగ్గట్లుగా ఉండటంతో.. ఇంటలిజెన్స్ చీఫ్ బదిలీ వెనుక కుట్ర ఉందని.. టీడీపీ గట్టిగానే అనుమానిస్తోంది. మరి ఈ విషయంలో కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో మరి..!