రామ్ గోపాల్ వర్మకు కోర్టు షాకిచ్చింది. వర్మ తాజా వివాదస్పద చిత్రం `మర్డర్` విడుదలను నిలిపివేయాలంటూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు మధ్యంతర ఉత్వర్వులు ఇచ్చింది. నల్గొండలో జరిగిన ప్రణయ్ హత్య కేసు ఆధారంగా వర్మ రూపొందించిన చిత్రమిది. ఓటీటీలో విడుదల చేయాలని భావించారు.
ఈ సినిమాపై ఇటు అమృత వర్గానికీ – వర్మకి ముందు నుంచీ గొడవ నడుస్తూనే ఉంది. ఈ సినిమాని, వర్మని ఉటంకిస్తూ.. అమృత సోషల్ మీడియాలో ఓ లేఖ కూడా పోస్ట్ చేసింది. ఆ తరవాత ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని అమృత వర్గం కోర్టుకెక్కింది.
తమ కుటుంబాన్ని సంప్రదించకుండా వర్మ సినిమా తీస్తున్నారని, ఈ చిత్రంలో తమ కులాన్నీ, కుటుంబాన్నీ కించపరిచేలా సన్నివేశాలున్నాయని అమృత తరపు న్యాయవాది పిటీషన్ లో పేర్కొన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు ‘మర్డర్’ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులపై స్టే కోసం హై కోర్టుకు వెళ్తామని వర్మ తరపు న్యాయవాది తెలిపారు.