ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కట్టివేసింది. ఇటీవల వాదనలు పూర్తయిన తర్వాత న్యాయమూర్తి తీర్పు రిజర్వ్ చేశారు. తాజాగా తీర్పు వెలువరించారు. ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ తరపు లాయర్ చేసిన వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. ఆయన క్వాష్ పిటిషన్ కొట్టి వేసింది. అలాగే కేటీఆర్ అరెస్టుపై ఉన్న స్టేను కూడా ఎత్తివేసింది. అంటే ఏసీబీ అధికారులకు ఇప్పుడు అరెస్టు చేయడానికి ఎలాంటి అడ్డంకులు లేవు.
కేటీఆర్ కు సుప్రీంకోర్టుకు వెళ్లడమే మార్గంగా ఉంది. ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. హైకోర్టులో ఆయన తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్దార్థ దవే వాదనలు వినిపించారు. అయితే పిటిషన్ ను మూవ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ కేసులో అటు. ఏసీబీ ఇటు ఈడీ రెండూ కేటీఆర్ కోసం ఎదురు చూస్తున్నాయి. తొమ్మిదో తేదీన ఏసీబీ ఎదుట కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. నోటీసులు ఇచ్చారు కాబట్టి అప్పటి వరకూ అరెస్టు చేయరని అనుకోవచ్చు. ఆ రోజున అరెస్టు అయితే ఏదైనా జరగొచ్చు.
ఈడీ ఎదుట కూడా కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. కానీ క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వులో ఉన్న కారణంగా విచారణ వాయిదా వేయాలని ఆయన ఈడీకి లేఖ రాశారు. ఈడీ అంగీకరింరించింది. ఇప్పుడు ఈడీ మరో నోటీసు జారీ చేయనుంది. అక్కడా కేటీఆర్కు చిక్కులు తప్పకపోవచ్చంటున్నారు.