అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డికి కోర్టుకు హాజరయ్యే విషయంలో వ్యక్తిగత హాజరు మినహాయింపు లభిస్తుందో లేదో అన్న విషయం నవంబర్ ఒకటో తేదీన తేలనుంది. జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు వాదనలు పూర్తయ్యాయి. అటు జగన్ తరపు న్యాయవాదులు.. ఇటు సీబీఐ లాయర్లు తమదైన వాదన వినిపించారు. న్యాయమూర్తి తీర్పును నవంబర్ ఒకటో తేదీకి రిజర్వ్ చేశారు. జగన్ పిటిషన్‌కు వ్యతిరేకంగా సీబీఐ స్ట్రాంగ్ కౌంటర్ దాఖలు చేయడంతో… నేటి విచారణపై.. అందరిలోనూ ఆసక్తి వ్యక్తమయింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టే.. ఆయనకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలనే ఏకైక కోణంలోనే.. ఆయన తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారని.. ఆయన ప్రతీ శుక్రవారం కోర్టుకు రావాలంటే.. రెండు రోజుల సమయం వృధా అవుతుందని… జగన్ లాయర్లు కోర్టులో వాదించారు. దాంతో పిటిషన్లో పేర్కొన్నట్లుగా ప్రజాధనం.. ఇతర అంశాలనూ.. వివరించారు. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ పైనా.. తమదైన వాదనలు వినిపించారు. అయితే.. అందులో అంశాలకు వ్యతిరేకంగా బలమైన వాదన అంటే.. ప్రతీ అంశానికి .. జగన్ ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తు చేయడానికే ప్రాధాన్యం ఇచ్చారు. సీబీఐ కౌంటర్ పిటిషన్లో గౌరవనీయులైన ముఖ్యమంత్రి అని సంబోధించలేదని.. జగన్ లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో.. కోర్టులో ఉన్న ఇతరులు ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. కేసు ఏపీ ముఖ్యమంత్రిపై కాదని.. జగన్ పై ఉందన్న విషయాన్ని జగన్ లాయర్లు ఎందుకు మర్చిపోయారన్న సెటైర్లు పడ్డాయి.
సీబీఐ కూడా.. కౌంటర్లో పేర్కొన్న అన్ని అంశాలను న్యాయస్థానం ముందు ఉంచింంది. జగన్ కు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వవద్దని స్పష్టం చేసింది. గతంలో సీబీఐ కోర్టు, హైకోర్టు అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వలేదని వాదించారు. అయితే.. అప్పుడు జగన్ సీఎంకాదని.. ఇప్పుడు జగన్ సీఎం అన్న వాదనను జగన్ లాయర్లు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును నవంబర్ ఒకటో తేదీకి రిజర్వ్ చేసింది.