ప్రభుత్వ జీవోలను జారీ చేసిన 24 గంటల్లో అందుబాటులో ఉంచాలని తెలంగాణ హైకోర్టు ఆదేశిచింది. దీంతో అందరూ ఏపీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే రెండు రోజుల ముందే ఏపీ ప్రభుత్వం జీవోలన్నీ సీక్రెట్‌గా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.మాన్యువల్ పద్దతిలో రిజిస్టర్లు పెట్టుకుని జీవోలివ్వాలని ఆన్లైన్లో వద్దని చెప్పింది.ఈ మేరకు జీవోఐఆర్ వెబ్సైట్లో అప్ లోడ్స్ నిలిచిపోయాయి. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు తీర్పును చూపిస్తూ ఎవరైనా ఏపీ హైకోర్టులో పిటిషన్ వేస్తే ఏమవుతుంది. ..? ఏపీ ప్రభుత్వానికి మరో మొట్టికాయ పడుతుంది. అంతకుమించి వేరే నిర్ణయం వస్తుందని అనుకోలేమని న్యాయనిపుణులు అంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వ నిర్ణయాలు తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందంటున్నారు.
ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం ప్రభుత్వం ప్రతి సమాచారాన్నీ ప్రజలకు అందుబాటులో ఉంచాలి. జీవోలను ప్రభుత్వాలు రహస్యంగా ఉంచవద్దని కేంద్రం కూడా పలుమార్లు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర విజిలెన్స్ కమిషన్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. గతంలో పలు న్యాయస్థానాలు కూడా ఇదే తీర్పు చెప్పాయి. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును బట్టి ఎవరో ఒకరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఖచ్చితంగా పిటిషన్ వేస్తారు. అప్పుడు ప్రభుత్వ నిర్ణయానికి ఎదురు దెబ్బ తగలక మానదని.. జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్న నిర్ణయమే వస్తుందని న్యాయనిపుణులు అంటున్నారు.
కాన్ఫిడెన్షియల్ పేరుతో గతంలో జీవోలు జారీ చేసేవారు. టీడీపీ ప్రభుత్వం కూడా జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వం కూడా ఇలాంటి ఎన్నో జీవోల్ని జారీ చేసింది. విపక్షంలో ఉన్నప్పుడు రహస్య జీవోలను తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రజల హక్కులను కాలరాస్తోందని ప్రతిపక్ష నేతగా జగన్‌తో పాటు వైసీపీ నేతలందరూ విమర్శలు చేసేవారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పూర్తిగా రివర్స్ అయ్యారు. అప్పట్లో వారు మాట్లాడిన మాటలన్నీ… ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సీఎం జగన్ చెప్పిన పారదర్శకత కూడా ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.