ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు సగటున రోజుకు పదివేల చొప్పున నమోదవుతున్నాయి. ఈ నెల ఎనిమిదో తేదీన రెండు లక్షల మార్క్‌ను దాటిన పాజిటివ్ కేసులు పద్దెనిమిదో తేదీకి మూడు లక్షలు దాటేశాయి. ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా 9,652 కరోనా కేసులు నమోదయ్యాయి. 88 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 85,130 ఉన్నాయి. మహారాష్ట్ర తర్వాత అత్యధిక యాక్టివ్ కేసులు ఉన్నది ఆంధ్రప్రదేశ్‌లోనే. రోజువారీ కేసుల నమోదులో..మహారాష్ట్ర కన్నా.. ఏపీనే ముందు ఉంది. మరణాలు కూడా.. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికం చోటు చేసుకుంటున్నాయి.
కరోనా కేసుల డబ్లింగ్ రేటులో ఆంధ్రప్రదేశ్ అందరికంటే ముందు ఉంది. పది రోజుల్లోనే..కేసులు రెట్టింపు అవుతున్న రాష్ట్ర మరొకటి లేదు. టెస్టుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ..పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటం అధికారవర్గాలనుసైతం ఆందోళనకు గురి చేస్తోంది. నిన్న యాభై ఆరు వేల టెస్టులు చేసినా..దాదాపుగా పది వేల కేసులు నమోదయ్యాయి. అంటే.. పాజిటివ్ రేటు పదిహేను శాతానికంటే ఎక్కువగా ఉంది. ఇది జాతీయ సగటు కంటే చాలా ఎక్కువ. గ్రామీణ ప్రాంతాల్లోనూ వైరస్ ప్రమాదకరంగా విస్తరిస్తోంది.
కేసులు విపరీతంగా పెరుగుతూ ఉండటంతో వైద్యం అందించడం కూడా భారంగా మారుతోంది. డిశ్చార్జ్‌లు అధికంగా ఉంటున్నప్పటికీ.. లక్షణాలు లేని వారిని ఐదు రోజుల్లో ఇంటికి పంపించేస్తున్నారు. వారందరని డిశ్చార్జ్ జాబితాలో వేస్తున్నారు. అలాంటి వారు తర్వాత బయట యథేచ్చగా తిరుగుతూ…కోవిడ్ వ్యాప్తికి కారణం అవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరణాలు పెరగడానికి కూడా.. ఈ అసంప్టమాటిక్ కేసులే ఎక్కువ కారణం అని అంచనా వేస్తున్నారు.