కేంద్ర ప్రభుత్వం ఒమిక్రాన్ విషయంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అయితే ఆఫ్రికా దేశాల నుంచి వస్తున్న విమానాల విషయంలో మాత్రం ఆంక్షలు విధించలేదు. ఇప్పటికే ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు బయటపడిన దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు మాత్రం గట్టిగా ఆంక్షలు విధించారు. టెస్టులతో పాటు క్వారంటైన్ నిబంధనలు అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. దక్షిణాఫ్రికాలో బయటపడిన కరోనా కొత్త వేరియంట్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమిక్రాన్ అని పేరు పెట్టింది.
దానికి 50కిపైగా మ్యూటెంట్లు ఉన్నట్లుగా తేలడంతో అత్యంత ప్రమాదకరమైనదని.. ఇప్పటి వరకూ తీసుకున్న వ్యాక్సిన్లు కూడా పని చేయవన్న ప్రచారం జరుగుతోంది. అయితే కొత్త వైరస్ ఎంత ప్రమాదకరమో ఇప్పుడే చెప్పలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. గత రెండు సీజన్లలో ఓసారి కరోనా.. మరోసా డెల్టా రకాలు సృష్టించిన మారణహోమాన్ని అనుభవించిన దేశాలు పెద్ద ఎత్తున జాగ్రత్తలుతీసుకుంటున్నాయి.
ఇప్పటికే యూరోపియన్ దేశాలు ఆఫ్రికా నుంచి రాకపోకల్ని నిలిపివేశాయి. పలు ఆంక్షలు విధించాయి. ఇండియా ఆ దిశగా ఇంకా కఠినమైన చర్యలు తీసుకోలేదు కానీ.. జాగ్రత్తలు మాత్రం తీసుకోవడం ప్రారంభించారు. దేశంలో ఇంత వరకూ ఒమిక్రాన్ రకం వైరస్ సోకిన వారెవరూ లేరు. అయితే ప్రజలకు మాత్రం ధర్డ్ వేవ్ ప్రారంభ సంకేతాలు అందుతున్నట్లుగానే కనిపిస్తున్నాయి.