తెలంగాణలోకి అంబులెన్స్‌లు రాకుండా అడ్డుకోవడం వివాదాస్పదమయింది. సాధారణంగా ఎక్కడైనా అంబులెన్స్ కనిపిస్తే.. ట్రాఫిక్ క్లియర్ చేసి మరీ దారి ఇస్తారు. ఎక్కడైనాఅధికార పార్టీ నేతల పనుల వల్ల అంబులెన్స్‌లు ఆగిపోతే తీవ్రంగా వివాదాస్పదమవుతుంది. అలాంటిది.. పదుల కొద్దీ అంబులెన్స్‌లను నిలిపివేయడం అంటే.. అసాధారణమైన చర్యే. ఒక్క ఏపీ నుంచి కాకుండా… అటు మహారాష్ట్ర నుంచి వస్తున్న అంబులెన్స్‌లను కూడా తెలంగాణ సర్కార్ నిలిపివేసింది. కర్ణాటక సరిహద్దు నుంచి వస్తున్న వాటిని కూడా నిలిపివేసింది. దీంతో.. ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి.
నిజానికి మహారాష్ట్ర, కర్ణాటకలకు తెలంగాణతో ఉన్న సరిహద్దులవల్ల… ఆయా ప్రాంతాల వారికి హైదరాబాదే రాజధానిగా ఉంది. మహారాష్ట్ర వాసులు ముంబైకి వెళ్లాలన్నా.. కర్ణాటక వాసులు బెంగళూరు వెళ్లాలన్నా దూరాభారం. అందుకే… ప్రభుత్వ పనులు కాకుండా మరే పనికైనా,… ఆయా ప్రాంతాల ప్రజలు హైదరాబాద్ వస్తూంటారు. ఏపీ ప్రజల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేనికైనా వారి గమ్యస్థానం హైదరాబాద్. దీంతో హైదరాబాద్‌పై ఒత్తిడి పెరిగిపోయింది. హైదరాబాద్‌లో ఉన్న అంతర్జాతీయ స్థాయి వైద్య సౌకర్యాలు… ఇతర రాష్ట్రాలు.. దేశాల వారినీ ఆకర్షిస్తున్నాయి. ఎయిర్ అంబులెన్స్‌లు రోజుకు ముప్ఫైకి పైగానే వస్తున్నాయి. దీంతో ఇతర రాష్ట్రాల కరోనా పేషంట్లతో తెలంగాణ ఆస్పత్రులు నిండిపోతున్నాయి.
మరో వైపు.. తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసుల వల్ల… ఆస్పత్రుల్లో బెడ్లు ఉండటం లేదన్న అభిప్రాయం ఏర్పడుతోంది. ఇది ప్రజలకు అసౌకర్యంగా మారింది. ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ దశలో.. తమ రాష్ట్ర ప్రజల అవసరాలకే ప్రాధాన్యం ఇస్తే.. మంచిదన్న ఆలోచనకు వచ్చినట్లుగా చెబుతున్నారు. అందుకే.. అంబులెన్స్‌ల నిలిపివేత వంటి కఠినమైన చర్యలు తీసుకున్నారని అంచనా వేస్తున్నారు. అయితే.. ఆస్పత్రుల్లో బెడ్లు ఉన్న వారిని అనుమతిస్తున్నారు. మరో వైపు ఈవివాదం రేగుతున్న సమయంలోనే… కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. దాని ప్రకారం.. రోగులు దేశంలో ఎక్కడైనా వైద్యం పొందే హక్కు కలిగి ఉన్నారు. ఈ పరిణామాలన్నింటితో అంబులెన్స్‌లకు అనుమతి మళ్లీ ఇచ్చారు.
లాక్ డౌన్ నిర్ణయం తీసుకోబోతున్న సర్కార్.. ఇక అనుమతి ఉన్న అంబులెన్స్‌లను మాత్రం అంగీకరించే అవకాశం ఉంది. దీని ద్వారా..తెలంగాణ వైద్య వర్గాలపై ఒత్తిడి తగ్గుతుదని ప్రభుత్వం కూడా అంగీకరిస్తోంది. మంచి తనం కారణంగా ఇతర రాష్ట్రాల కరోనా ఒత్తిడి కూడా తామే భరించామని .. అది తమ ప్రజలకు ఇబ్బందికరంగా మారుతోంది కాబట్టి.. ఇంకా ఎంతో కాలం భరించలేమన్న అభిప్రాయంతో తెలంగాణ సర్కార్ ఉంది.