వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్గా భావిస్తున్న ఐదు రాష్ట్రాలఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంగం ప్రకటించింది. 7 దశల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలను నిర్వహిస్తారు. తొలి దశ నోటిఫికేషన్ జనవరి 14వ తేదీన విడుదల కానుంది. మొదటి దశ పోలింగ్ ఫిబ్రవరి 10వ తేదీన ఉంటుంది. ఆ తర్వాత వరుసగా 14, 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో వరుసగా పోలింగ్ జరుగుతుంది. యూపీలోనే ఏడు విడుతలు జరుగుతాయి. మార్చి పదో తేదీన కౌంటింగ్ జరుగుతుంది.
రెండో విడత అయిన ఫిబ్రవరి 14వ తేదీన పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాల్లో ఒకే దశలో పోలింగ్ ముగుస్తుంది. మణిపూర్లో మాత్రం ఐదు, ఆరో విడతల్లో ఎన్నికలు జరుపుతారు. యూపీలో మాత్రం ఏడు విడతలూ ఎన్నికలు జరుగుతాయి. ఈ సారి నామినేషన్ల విషయంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో నామినేషన్లు స్వీకరిస్తారు. జనవరి 15 వరకు రోడ్ షోలను నిషేధించారు.
రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటలకు వరకూ పబ్లిక్ మీటింగ్ పెట్టకూడదు. అభ్యర్థుల విజయోత్సవాలు రద్దు చేశారు. పాదయాత్రలు, రోడ్ షోలకు కూడా అనుమతి లేదు. ఈ సారి ఎన్నికల ప్రచారం భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ర్యాలీలతో హోరెత్తించినపార్టీలు.. ఆక ఆన్ లైన్ ప్రచారానికే పరిమితం కావాల్సి ఉంటుంది.