లాక్డౌన్ వార్షికోత్సవం జరుపుకుటున్న సమయంలో… మరోసారి ఆంక్షల దిశగా దేశం వెళ్తోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇప్పటికే కరోనా విజృంభిస్తోంది. ఆయా నగరాల్లో పాక్షికంగా ఆంక్షలు విధిస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లోనూ అలాంటి ఆంక్షలు విధించాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. గతంలోలా కాకుండా ఈ సారి కేసీఆర్ కరోనా గురించి చాలా సీరియస్‌గానే అసెంబ్లీలో మాట్లాడారు. చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ క్రమంలో ఆయన నేరుగా ప్రకటించకపోయినా… పరిస్థితిని బట్టి ఎనిమిదో తరగతి వరకూ స్కూళ్లు మూసేయాలనే ఆలోచన చేస్తున్నట్లుగా మీడియాకు సమాచారం ఇచ్చారు.
ఈ అంశంపై ఎప్పుడు కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తే.. అప్పుడు కీలక నిర్ణయాలు ప్రకటించడానికి అధికారులు ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. హైదరాబాద్‌లో పెద్దగా కరోనా కేసులు బయటపడటం లేదు. అయినప్పటికీ.. ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా జనం ఎక్కువగా గుమికూడే ప్రాంతాల్లో కట్టడిచేయాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఫంక్షన్లు…మాల్స్…సినిమా హాళ్లు వంటి విషయాల్లో ప్రజల హాజరుకు సంబంధించి కొన్ని పరిమితులు పెట్టే అవకాశం కనిపిస్తోంది. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే..తెలంగాణలో కరోనా ప్రభావం భారీగా లేదని చెప్పుకోవచ్చు. అయితే పలు చోట్ల స్కూళ్లలో వరుసగా కరోనా కేసులు బయటపడుతున్నాయి.
ఇటీవల హైకోర్టు కూడా కరోనా కట్టడికి కొన్ని ఆంక్షలు విధించాలని ప్రభుత్వానికి సూచనలు చేసింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. గతంలో లాక్ డౌన్ విధించడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయ నష్టం వచ్చింది. అలాంటి పరిస్థితిని మళ్లీ ఎవరూ కోరుకోరు. ప్రభుత్వం కూడా కోరుకోదు. కానీ పరిస్థితుల్ని బట్టి… నిర్ణయం తీసుకోక తప్పదు. జన జీవనంపై ఎలాంటి ఆంక్షలు విధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని.. కానీ కరోనాను ఎదుర్కోవడానికి కొన్ని చర్యలు తీసుకోక తప్పదని అధికారులు అంటున్నారు.