పద్దెనిమిదేళ్లు నిండిన వారందరికి మే ఒకటో తేదీ నుంచి వ్యాక్సిన్ వేస్తామని కేంద్రం ప్రకటించింది.రాష్ట్రాలు తాము ఉచితంగా ఇస్తామని ఘనమైన ప్రకటనలు చేశాయి. బుధవారం నుంచి రిజిస్ట్రేషన్లను కోవిన్ యాప్‌లో ప్రారంభిస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఒకటో తేదీన టీకా అందిస్తారా అన్నది ఇప్పుడు అసలైన సందేహం. ఎందుకంటే ప్రస్తుతం దేశంలో టీకా నిల్వలు పది శాతం ప్రజలకు ఇవ్వడానికి కూడా సరిపోవు. ఎంత వేగంగా ఉత్పత్తి చేసినా డిమాండ్ తీరే చాన్స్ లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. 45 ఏళ్లు పైబడిన వారికే టీకా అందడం కష్టంగా మారింది. ఏ రోజుకారోజు వ్యాక్సినేషన్ కార్యక్రమం దినదినగండంగా మారింది. ఇలాంటి తరుణంలో మరో నాలుగు రోజుల తర్వాత నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు ఇవ్వడం ఇప్పటి పరిస్థితుల్లో సాధ్యం కాదనే అభిప్రాయంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలున్నాయి.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 18-45 ఏళ్ల వారికి టీకాల్విడం సాధ్యం కాదని తేల్చేసింది. ఉత్పత్తి సంస్థలు వ్యాక్సిన్ సరఫరా చేయలేమని చెప్పాయని జగన్ సర్కార్ వెల్లడించింది. ఏపీలో 18 నుంచి 45 ఏళ్ల వయస్సులో 2.4 కోట్ల మంది ఉన్నారు. వీరందరికి వ్యాక్సిన్ అందించాలంటే 4 కోట్ల డోసులు అవసరం. తెలంగాణలో 3.5 కోట్ల జనాభా ఉంటే అందులో ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్న వారిని, 18లోపు వారిని మినహాయిస్తే మరో 3 కోట్ల మందికి టీకాలు ఇవ్వాల్సి ఉంటుంది. రెండు డోసులకు కలిపి ఆరు కోట్ల డోసులు అవసరం టీకా కార్యక్రమంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. భారత్ బయోటెక్‌తో ఒప్పందం చేసుకుంది. అయితే ప్రస్తుతం వ్యాక్సిన్ ఉత్పత్తే చాలా తక్కువగా ఉందని, వచ్చే డోసుల ఆధారంగానే ప్రణాళికలు సిద్దం చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.
దేశంలో ప్రస్తుతం రెండే కంపెనీలు కొవిడ్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. సీరం ఇన్స్టిట్యూట్ ప్రతి నెలా 6 కోట్లు, భారత్ బయోటెక్ 1 కోటి డోసులను ఉత్పత్తి చేస్తున్నాయి. అంటే, ప్రతిరోజూ 23.50 లక్షల డోసులన్న మాట. ఇందులో 50 శాతం కేంద్రం తీసుకుంటుంది. మిగిలిన 50 శాతం.. అంటే 11.66 లక్షల డోసులను 29 రాష్ట్రాలు, ప్రైవేటు ఆస్పత్రులు పంచుకోవాల్సి ఉంటుంది. అందులో సగానికి పైగా ముందే ఇచ్చిన కమిట్మెంట్ కారణంగా ప్రైవేటు ఆస్పత్రులకు, ఇతర సంస్థలకు వెళ్తాయి. మిగిలిన డోసులు రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉంటుంది. వీటన్నింటినూ చూస్తే.. మే ఒకటో తేదీ నుంచి పద్దెనిమిదేళ్లు నిండిన వారికి టీకా అనేది పబ్లిసిటీ స్టంట్‌గానే మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది.