ఆంధ్రప్రదేశ్‌లో కరోనా శరవేగంగా విస్తరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఒక్కో రోజు.. ఒక్కో నగరంలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. గతంలో కర్నూలులో ..ఆ తర్వతా గుంటూరులో.. నిన్న కృష్ణాజిల్లాలో మళ్లీ ఇవాళ కర్నూలులో.. భారీగా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 647కి చేరుకున్నాయి. ఇరవై నాలుగు గంటల్లో జరిపిన పరీక్షల్లో 44 కొత్త కేసులు వెలుగుచూసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో అత్యధికం కర్నూలులోనే ఉన్నాయి. ఇరవై నాలుగు గంటల్లో కర్నూలులో ఇరవై ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ జిల్లా మొత్తం మీద 158 కేసులు ఉన్నట్లయింది.
చాలా రోజుల నుంచివిశాఖలో పాజిటివ్ కేసులు నమోదు కావడం లేదు. తాజా…మర్కజ్‌కు వెళ్లి వచ్చిన ఓ మహిళకు పాజిటివ్‌గా తేలిందని..ప్రభత్వం ప్రకటించింది. కేసుల వారీగా చూస్తే..కర్నూలు తర్వాత గుంటూరులో అత్యధికంగా 129 పాజిటివ్ కేసులు ఉన్నాయి. కరోనా వైద్యం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకూ ఏపీలో 65 మంది చికిత్స పూర్తి చేసుకుని వెళ్లారు. పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయారు. 565 యాక్టివ్ కేసులకు ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం… ప్రభుత్వం ఉదయం, సాయంత్రం రెండు మీడియా బులెటిన్లు విడుదల చేసిది. కానీ ఇప్పుడు ఒక్క బులెటిన్ మాత్రమే విడుదల చేస్తోంది.
ర్యాపిడ్ టెస్టు కిట్లు వచ్చినప్పటికీ.. వాటి ద్వారా చేసిన టెస్టులు.. కరోనా టెస్టులుగా పరిగణించలేమని కేంద్రం స్పష్టం చేసింది. ఐసీఎంఆర్ రూల్స్ ప్రకారం చేసిన టెస్టుల్లో నెగెటివ్‌గా వస్తే మాత్రమే… నెగెటివ్ అని స్పష్టం చేసింది. అయినా ఏపీ అధికారులు.. ఆ రాపిడ్ టెస్టుల వివరాలను కూడా నెగెటివ్ ఖాతాలో వేసి.. రోజుకు నాలుగు వేల టెస్టుల వరకూ చేస్తున్నామని ప్రకటనలు చేస్తున్నారు. ఈ ప్రకారం.. ఏపీలో ఇప్పటి వరకూ పాతిక వేలకుపైగా టెస్టులు పూర్తి చేసినట్లయింది.