దేశంలో మూడో దశ వ్యాక్సినేషన్‌ను కేంద్రం అమలు చేస్తోంది. ఎంత వేగంగా అమలు చేస్తోందంటే… రోజుకు రెండు లక్షల పైచిలుకు మందికి ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ ఇస్తోంది. మరీ ఇంత వేగమా అని అందరూ ఆశ్చర్యపోయేలా.. ఈ విషయాన్ని గొప్పగా ప్రకటించుకుంటోంది. ఈ వేగంతో… అందరికీ టీకాలు ఇవ్వాలంటే… ఒక ముఫ్పై, నలభై ఏళ్లు మాత్రమే పడుతుంది. ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంత వేగంగా వ్యాక్సిన్ అందివ్వడం లేదని.. ప్రపంచం అంతా మన వైపు చూస్తోందని.. ప్రధానమంత్రి గారు మన్‌కీ బాత్‌లో చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
18-45 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు కానీ.. అది పబ్లిసిటి స్టంట్‌గానే మిగిలిపోయింది. కేంద్రం… రాష్ట్రాలకు టీకా డోసులు పంపిణీ చేయడం లేదు. అరకొరగా పంపిణీ చేసి.. వాటినే ఇవ్వాలని చెబుతోంది. రాష్ట్రాలు .. కేంద్రం పంపే ఆ అరకొరే.. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికో… లేకపోతే..రికమండేషన్లు ఉన్న వారికో పంపిణీ చేస్తోంది. కొన్ని రాష్ట్రాలు.. నలభై ఐదేళ్లు నిండిన వారికి మాత్రమే.. పంపిణీ చేస్తున్నాయి. కేంద్రం.. వ్యాక్సిన్లను సేకరించడంలో నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది. ఆర్డర్లుపెట్టి ఆఘమేఘాలపై అందరికీ పంపిణీ చేయాలన్న ఆలోచన చేయడం లేదు. విసుగుపుట్టి.. ప్రభుత్వాలు.. ప్రజలు కొనుక్కుని వ్యాక్సిన్లు వేసుకుంటారన్న అభిప్రాయంతో ఉన్నట్లుగా ఉన్నారు. అందుకే.. పట్టించుకోవడం లేదు.
కేంద్రం అరకొరగా పంపే వ్యాక్సిన్లలో అత్యధికం గుజరాత్ కే పంపుతున్నారు. రాష్ట్రాలకు ఇచ్చే వ్యాక్సిన్ల కోటాను ఏ విధంగా నిర్ణయిస్తున్నారో ఎవరికీ క్లారిటీ లేదు. కానీ.. గుజరాత్‌కు మాత్రం 30 నుంచి 40 శాతం కోటా వరకూవెళ్తోంది. ప్రశ్నించేవారు ఎవరూ లేరు. తెలుగు రాష్ట్రాల్లో నలభై ఐదేళ్లు నిండిన వారికి కూడా వ్యాక్సిన్ దొరకడం లేదు. రెండో డోస్ కోసం ఎదురు చూస్తున్న వారు లక్షల్లో ఉన్నారు. కేంద్రం ఇస్తే వేద్దాం లేకపోతే లేదన్నట్లుగా ప్రభుత్వాలు ఉంటున్నాయి. మధ్యలో ప్రజలే నలిగిపోతున్నారు.
ప్రపంచంలోని ఇతర దేశాలన్నీ ప్రజల్ని కాపాడుకోవడానికి… యుద్ధ ప్రాతిపదికిన వ్యాక్సిన్లు వేయించాయి. మన దేశం దగ్గర వ్యాక్సిన్లుకొనుగోలు చేసి.. ప్రజలకు ఉచితంగా పంచిన దేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. చివరికి అత్యంత ధనిక దేశం అయిన కెనడాకు కూడా ఇండియా నుంచి వ్యాక్సిన్లు వెళ్లాయి. అక్కడి ప్రజలు వ్యాక్సిన్‌కు నోచుకున్నారు. కానీ ఇండియాలో మాత్రం ఇప్పటికీ… 90శాతానికిపైగా ప్రజలకు వ్యాక్సిన్ దొరకలేదు. మిగిలిపోయిన 120 కోట్ల మంది జనాభాకు వ్యాక్సిన్ వేయాల్సి ఉంటే.. ఒక్క రోజులో రెండు లక్షల మందికి వేశామని.. ప్రభుత్వం ప్రకటించుకుంటోంది.