హైదరాబాద్: ఇండియాలో ఆన్లైన్ పోర్టల్స్ వచ్చిన తర్వాత కిరాణా సరుకులనుంచి మోటార్ సైకిల్స్ దాకా అన్నీ డోర్ డెలివరీ చేసేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పేడతో చేసే పిడకలను కూడా ఈ పోర్టల్స్‌లో అమ్ముతున్న వైనం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఆ పేడ మామూలు పేడ కాదులెండి. పవిత్రమైన ఆవుపేడ. హిందూ మతానికి సంబంధించిన హోమాలు, యాగాలు తదితర క్రతువులు చేసేటపుడు ఆవుపేడతో చేసిన పిడకలు అవసరమవుతాయి. అయితే నగరాలు, మహానగరాలలో ఆవుపేడ దొరకటం దుర్లభమన్న సంగతి తెలిసిందే. ఈ అవసరాన్నే గుర్తించారో ఔత్సాహిక పారిశ్రామికవేత్త.
ప్రీతి కర్లా అనే ఈ మహిళ ఢిల్లీలో ఆసియా క్రాఫ్ట్స్ దుకాణాన్ని నడుపుతున్నారు. ఈ సంస్థ హిందూ పూజాదికాల్లో వాడే వస్తువులను, పదార్థాలను అమ్ముతుంటారు. ఒకసారి భక్తి ఛానల్ చూస్తున్న ప్రీతి కర్లాకు, దానిలో ఆవు పేడ పిడకల ప్రాశస్త్యాన్ని ఒక స్వామీజీ వివరించటం చూసి చటుక్కున ఓ ఆలోచన వచ్చింది. ఢిల్లీ శివార్లలోని గ్రామాలనుంచి ఆవుపేడతో చేసిన పిడకలను సేకరించి ఆన్లైన్లో అమ్మటం ప్రారంభించారు. తర్వాత తర్వాత సొంతంగా పిడకల తయారీ యూనిట్ చేపట్టారు. అమెజాన్, షాప్ క్లూస్ వంటి ఆన్లైన్ పోర్టల్స్‌లో అమ్మకాన్ని ప్రారంభించారు. ఒక్కో పిడకను రు.40 దగ్గరనుంచి అమ్ముతున్నారు. విదేశాలలోని హిందూ ఆలయాలనుంచి కూడా ఆర్డర్లు వస్తుండటంతో ఈమె వ్యాపారం మూడు పిడకలు, ఆరు ఆర్డర్లుగా సాగిపోతోంది.