ఒకప్పుడు ఆ పార్టీలకు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు బ్రహ్మరథం పట్టేవారు. బడుగు, బలహీన వర్గాలు, కార్మికులు ఆ పార్టీలకు అండగా నిలబడేవారు. ఆ పార్టీలకు అంతో ఇంతో ఓటు బ్యాంకు కూడా ఉండేది. తెలుగు రాష్ట్రాలలో ఆ పార్టీల పట్ల చాలా సానుభూతి ఉండేది. ప్రజల కష్టాలపై పోరాడతారు అనే పేరు ఉండేది. ఇంత ఘనచరిత్ర ఉన్న ఆ పార్టీలు ఏవీ అనుకుంటున్నారా?. ఇంకేమిటి వామపక్ష పార్టీలు. సీపీఐ, సీపీఎంలుగా పిలవబడే ఆ రెండు వామపక్ష పార్టీలు ఇప్పుడు సోదిలో కూడా లేకుండా పోతున్నాయి. ప్రజల తరపున పోరాటాలు చేయాల్సిన కమ్యూనిస్టు పార్టీల ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఓటు బ్యాంకు రాజకీయాలలో నానాటికీ దిగజారిపోతున్న కమ్యూనిస్టు పార్టీలు ప్రజలకు దూరం అవుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్ లోనూ ఇటు తెలంగాణాలోనూ అధికార పార్టీలు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై కమ్యూనిస్టులు సరైన రీతిలో స్పందించడం లేదు.
రాజధాని కోసం 29 గ్రామాల ప్రజలు 55 రోజులుగా ఉద్యమాలు చేస్తుంటే సీపీఐకి చెందిన సీనియర్ నాయకులు రామకృష్ణ ఒక్కరే ఉద్యమానికి మద్దతుగా నిలబడ్డారు. ఆ పార్టీ జాతీయ నాయకుడు నారాయణ ఉద్యమ శిబిరం వద్దకు వచ్చి తొంగి చూసి వెళ్ళిపోతున్నారు. మరో వామపక్ష పార్టీ సీపీఎం అయితే ఆ శిబిరాల వైపు వెళ్లడం లేదు. ఒకటిన్నర దశాబ్దం క్రితం సంమైక్య రాష్ట్ర్రంలో విద్యుత్ చార్జీల పెంపుపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో దాదాపు యుద్ధం చేసిన సిపిఎం నాయకులు ఇప్పుడు అమరావతి రైతు ఉద్యమాన్ని పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితులలో తెలుగు ప్రజలు కమ్యూనిస్టు పార్టీలను పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణలో అయితే కమ్యూనిస్టు పార్టీలు చరిత్రలో కలిసిపోయాయని ప్రచారం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాలలో ఒకప్పుడు ఎంతో బలంగా ఉన్న వామపక్ష పార్టీలు ప్రథమ పక్షం నుంచి అథమ పక్షానికి జారిపోయాయి అని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్ లో దారుణ ఓటమితో అక్కడి ప్రజలకు దూరమైన సీపీఎం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా మనుగడ కోల్పోయే పరిస్థితి ఎదురైందంటున్నారు.