జనసేన, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ… ఆంధ్రాలో ఇదో కూటమిగా ఎన్నికల్లో తలపడుతోంది. ఏపీలో మూడో ప్రత్యామ్నాయ శక్తిగా తాముంటామనే ధీమాతో ఈ కూటమి ఉంది. తాజాగా ఏపీకి వచ్చిన మాయావతి… రాష్ట్రంలో తామే అధికారంలోకి వస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. పవన్ తో కలిసి సభల్లో కూడా పాల్గొంటున్నారు. అనూహ్యంగా ఏపీలో బీఎస్పీకి ఇంత ప్రాధాన్యత ఉందా అనే రీతిలో గత రెండు రోజులుగా జనసేన వ్యవహార శైలిలో మార్పు కనిపిస్తోంది. ఈ తీరుపై వామపక్షాలు ఇప్పుడు ఎలా స్పందిస్తున్నాయనేది కొంత చర్చనీయాంశంగా కనిపిస్తోంది.
ఈ చర్చకు కారణం ఉంది. బీఎస్పీ అధినేత్రి మాయావతిని కలిసేందుకు పవన్ వెళ్లగానే వామపక్షాల్లో కొంత చర్చనీయమైనట్టు కథనాలు అప్పుడు వచ్చాయి. మొదట్నుంచీ ప్రయాణిస్తున్న సీపీఐ, సీపీఎంలకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే మాయావతిని కలిసేందుకు పవన్ కల్యాణ్ వెళ్లారంటూ స్వయంగా ఆ పార్టీల నేతలే ఆఫ్ ద రికార్డ్ వాపోయిన పరిస్థితి ఉంది. మాయావతితో చర్చించి, పొత్తు ఖరారు చేసుకున్న తరువాతే బీఎస్పీ విషయం వామపక్షాలకు పవన్ కల్యాణ్ చెప్పారనే అభిప్రాయమూ ఉంది. అంతేకాదు, ఇప్పుడు పొత్తులో భాగంగా బీఎస్పీకి జనసేన ఇచ్చిన సీట్ల సంఖ్య కూడా వామపక్షాలతో పోల్చితే… కాస్త ఎక్కువ ప్రాధాన్యత లభించినట్టుగానే కనిపిస్తుంది.
ఆ రెండు పార్టీల్లో ఇప్పుడు చర్చ ఏంటంటే… జనసేన నుంచి మరిన్ని సీట్లను డిమాండ్ చేసి ఉంటే బాగుండేదని. ఏపీలో అన్ని జిల్లాల్లోనూ వామపక్షాలకు పార్టీపరంగా నిర్మాణం ఉంది, ప్రాతినిధ్యం ఉంది. కానీ, బీఎస్పీకి ఇక్కడ ఎలాంటి ఉనికీ లేదు. జిల్లాలవారీగా కేడర్, నిర్మాణం లాంటి వ్యవస్థే ఇక్కడ లేదు. అలాంటి బీఎస్పీకి పెద్ద సంఖ్యలో సీట్లు ఇచ్చారు పవన్. అంతేకాదు, ఇప్పుడు మాయావతి పర్యటన నేపథ్యంలో పవన్-బీఎస్పీల పొత్తు అన్నట్టుగానే ఎక్కువ ప్రొజెక్ట్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాము మొదట్నుంచీ జనసేనను కాస్త గట్టిగా డిమాండ్ చేసి ఉంటే మరిన్ని స్థానాలు దక్కే అవకాశం ఉండేదనేది వామపక్షాల అంతరంగం. పైకి చెప్పడం లేదుగానీ… ఏపీలో తమకంటే తక్కువ ప్రాబల్యం ఉన్న బీఎస్పీకి పవన్ కల్యాణ్ కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే అభిప్రాయం వారిలో ఉన్నట్టుగా ఇప్పుడు వినిపిస్తోంది. ఈ చర్చ పవన్ వరకూ వెళ్లిందా లేదా అనేది ఆ పార్టీ వర్గాలకే తెలియాలి.