పవన్ కళ్యాణ్ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ విమర్శిస్తుండేవాడు. రాజకీయాల గురించి మాట్లాడితే ప్రతిపక్ష పార్టీలన్నీ విమర్శించడం మొదలుపెడతాయి. పవన్ కళ్యాణ్ ఇది చాలా రోజులుగా ఎదురవుతున్న అనుభవమే. సినీ ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ బెడద వదిలింది కానీ రాజకీయాలలో మాత్రం పవన్ కళ్యాణ్ కి విమర్శలు ఎదుర్కోవలసి వస్తూనే ఉంది. ఆయన త్వరలో సినిమాలకి గుడ్ బై చెప్పేసి 2019ఎన్నికల బరిలో దిగుతానని పవన్ కళ్యాణ్ ప్రకటించినప్పటి నుంచి మళ్ళీ విమర్శలు, రకరకాల కామెంట్లు, సూచనలు, సలహాలు వినకతప్పడం లేదు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ సినిమాలలో అవకాశాలు తగ్గడం వలననే రాజకీయాలలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సమయంలో తెదేపా-బీజేపీ కూటమి తరపున ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్, ఆ తరువాత ఆ రెండు ప్రభుత్వాలు తప్పులు చేస్తే ప్రజల తరపున వాటిని నిలదీస్తానని ప్రజలకు గొప్పగా చెప్పుకొన్నారని కానీ అవి ఎన్ని తప్పులు చేస్తూన్నా చూసి చూడనట్లు మౌనం వహిస్తున్నారని రామకృష్ణ విమర్శించారు. రాష్ట్రంలో తెదేపా వైకాపా ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకి ప్రోత్సహిస్తున్నా చంద్రబాబు నాయుడు ఎందుకు నిలదీయడం లేదని రామకృష్ణ ప్రశ్నించారు.
ఎన్నికల ప్రచార సమయంలో నరేంద్ర మోడీ తరపున హామీలిచ్చిన పవన్ కళ్యాణ్ రెండేళ్ళు పూర్తి కావస్తున్నా కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా హామీని అమలుచేయకపోతే కేంద్రాన్ని నిలదీయడానికి ఎందుకు జంకుతున్నారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా గురించి డిల్లీ వెళ్లి మోడీని నిలదీసేందుకు పవన్ కళ్యాణ్ సిద్దం అయితే తాము అయన వెంట వస్తామని రామకృష్ణ చెప్పారు. ఇటువంటి విమర్శలు, సవాళ్ళకు పవన్ కళ్యాణ్ స్పందించకపోవచ్చును కానీ ఆయన రాజేసిన ఈ రాజకీయ వేడి తగ్గడానికి మరికొంత కాలం పట్టవచ్చును.