హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారం బయటపడినదగ్గరనుంచి వైసీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ వంటి పార్టీలు నిర్విరామంగా చంద్రబాబును తూర్పారబట్టటం చూస్తూనే ఉన్నాం. అయితే ఆ వ్యవహారం దాదాపు సద్దుమణుగుతుందనుకుంటున్న సమయంలో టీడీపీకి ఒకనాటి మిత్రపక్షమైన సీపీఐ ఇవాళ అనూహ్యంగా స్పందించింది. అసలు స్టీఫెన్సన్తో ఫోన్లో మాట్లాడారా, లేదా అనే విషయాన్ని చంద్రబాబు తేల్చిచెప్పాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి డిమాండ్ చేశారు. చెప్పటానికి ఇష్టం లేకపోతే స్వరపరీక్షకు, విచారణకు సిద్ధంకావాలని సవాల్ చేశారు. హైదరాబాద్లో సెక్షన్ 8 అమలు చేయాల్సిన అవసరం లేదని సురవరం అభిప్రాయపడ్డారు. బీజేపీ రాష్ట్రాలలో, కేంద్రంలో బయటపడుతున్న అవినీతి ఆరోపణలు ఆ పార్టీ డొల్లతనాన్ని బయటపెడుతున్నాయని అన్నారు. రాజకీయపార్టీలను సమాచారహక్కుచట్టంలోకి తీసుకురావటానికి తాము వ్యతిరేకమని సురవరం చెప్పారు. వ్యాపమ్ కుంభకోణానికి సంబంధించి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాలని, గవర్నర్ రాంనరేష్ యాదవ్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.