కమ్యూనిస్టు పార్టీలు సిద్ధాంత నిబద్ధత గల పార్టీలని చాలామంది అభిప్రాయం. ఇతర బూర్జువా పార్టీల మాదిరిగా అవి వ్యవహరించవని చెబుతారు. ఏదైనా ప్రధాన అంశంపై రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ ఒక తీర్మానం చేస్తే లేదా నిర్ణయం తీసుకుంటే వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా అందరూ తప్పనిసరిగా పాటిస్తారు. ఇతర పార్టీల్లో నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటారు. ఎవరికి తోచిన అభిప్రాయం వారు చెబుతుంటారు. కాని కమ్యూనిస్టు పార్టీల్లో అలా ఉండదు. పార్టీ విధానాలపై రాష్ట్ర కార్యదర్శి, జాతీయ స్థాయిలో జాతీయ కార్యదర్శి మాట్లాడతాడు.
ఏపీలో మూడు రాజధానులు రచ్చ మొదలైనప్పటినుంచి సీపీఐ అమరావతికి కట్టుబడి ఉంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సాగుతున్న రైతుల ఉద్యమంలో రామకృష్ణ చురుగ్గా పాల్గొంటున్నారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న కార్యక్రమాల్లో కనబడుతున్నారు. అప్పుడప్పుడు టీవీ చర్చల్లో పాల్గొంటూ అమరావతిని సమర్థిస్తూ మాట్లాడుతున్నారు. పార్టీ జాతీయ నేత డాక్టర్ నారాయణ కూడా అమరావతికి అనుకూలంగా జరుగుతున్న ఉద్యమంలో పాల్గొంటున్నారు.
జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అమరావతిని సమర్ధించడమనేది పార్టీ విధానం. దానికి అనుగుణంగానే పార్టీ కారాచరణ ఉంది. రాజధాని అమరావతిలోనే ఉంచి అభృవృద్ధిని వికేంద్రీకరణ చేయాలని చెబుతున్నారు. మూడు రాజధానుల వల్ల నష్టం కలుగుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను పార్టీ కర్నూలు జిల్లా కమిటీ ధిక్కరించింది. రామకృష్ణ అమరావతికి మద్దతు ఇస్తూ ఉత్తరాంధ్ర డిమాండును, రాయలసీమ డిమాండును పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించింది. అంతేకాకుండా ఈ వైఖరిపై తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని పార్టీ రాష్ట్ర కమిటీకి పంపుతారట…!
సీపీఐలో ఈ పరిణామం విచిత్రంగా ఉంది. అమరావతికి మద్దతు ఇవ్వాలనేది పార్టీ విధానం కాకపోతే రామకృష్ణ ఉద్యమంలో పాల్గొనరు కదా. మరి ఉత్తరాంధ్ర, రాయలసీమ డిమాండ్లను నిర్లక్ష్యం చేయడమేమిటో అర్థం కావడంలేదు. కమ్యూనిస్టు పార్టీల్లో ద్వంద్వ విధానం ఉండదు. మంచో చెడో ఒక అంశంపై ఒక విధానం నిర్ణయించుకుంటే దాని ప్రకారం కార్యక్రమాలు చేస్తారు. దాని పైనే మాట్లాడతారు. తెలంగాణ ఉద్యమంలో సీపీఐ ప్రత్యేక తెలంగాణ అనుకూల నిర్ణయం తీసుకుంది. చివరి వరకు దానికే కట్టుబడింది. మరి ఇప్పుడు తేడా ఎందుకు వచ్చిందో…! దీనిపై కార్యదర్శి రామకృష్ణ ఏం చెబుతారో…!