రెండు తెలుగు రాష్ట్రాలలో అన్ని పార్టీల కంటే ఎక్కువగా ఏ పార్టీలు ఏక్టివ్ గా ఉంటాయంటే వామపక్షాలేనని అంగీకరించక తప్పదు. సి.పి.ఐ., సిపిఎం.పార్టీల నేతలు నారాయణ,రాఘవులు జంటపక్షుల్లా కువకువలాడుతూ ఎప్పుడూ ఏదో ఒక ప్రజా సమస్యపై ప్రభుత్వంతో పోరాటం చేస్తూనే కనిపిస్తారు. అయినా ఇంతవరకు ఎన్నడూ ఆ రెండు పార్టీలు అధికారంలోకి రాలేకపోయాయి. పైగా ఇన్ని దశాబ్దాల పోరాటం తరువాత కూడా ఏదో ఒక పార్టీకి తోక పార్టీలుగానే ఉండిపోయాయి.
కానీ జనసేన పార్టీకి ‘ఒన్-మ్యాన్-ఆర్మీ’ వంటి పవన్ కళ్యాణ్ ఎన్నడూ దేనిపైనా హడావుడి చేయడు. దేనిపైనా స్పదించడు. అసలు ఇంతవరకు తన పార్టీనే నిర్మించుకోలేదు. కానీ ఆయన ఒక చిన్న ట్వీట్ మెసేజ్ పెట్టినా, ప్రెస్ మీట్ పెట్టినా అది సంచలనం సృష్టిస్తుంది. తుళ్ళూరుకి వస్తున్నట్లు ఒక చిన్న మెసేజ్ పెట్టినట్లయితే వేలాది మంది అభిమానులు స్వచ్చందంగా తరలివస్తారు. యావత్ దేశాన్ని ప్రభావితం చేస్తున్న మోడీ అంతటి వ్యక్తి ఎన్నికలలో పవన్ కళ్యాణ్ మద్దతు తీసుకొన్నారంటే ప్రజలపై, రాష్ట్ర రాజకీయాలపై పవన్ కళ్యాణ్ ప్రభావాన్ని ఆయన కూడా సరిగ్గానే అంచానా వేశారన్న మాట.
కానీ సిపిఐ నేత నారాయణ “పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాలలో ఒక ఎక్స్ ట్రా ప్లేయర్ వంటివాడు. పవన్ కళ్యాణ్ కొన్ని విషయాలపై స్పందిస్తాడు మరికొన్నిటిపై అసలు నోరు విప్పడు,” అని విమర్శించారు. బహుశః ఓటుకి నోటు కేసులో చంద్రబాబు నాయుడు పాత్ర గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదు? అని నారాయణ అనుమానం కావచ్చును. అందుకు కారణాలు అందరి కంటే నారాయనకే బాగా తెలుసు. కానీ నీతి నిజాయితీ గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ తెదేపాతో ఉన్న మైత్రి కారణంగా ఆ వ్యవహారం గురించి చంద్రబాబు నాయుడుని ప్రశ్నించక పోవడం వలననే నారాయణ పవన్ కళ్యాణ్ న్ని విమర్శించగలుగుతున్నారని చెప్పవచ్చును. అలాగే పట్టిసీమ ప్రాజెక్టు, పంట రుణాల మాఫీ వంటి అనేక అంశాలపై కూడా పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఎన్నడూ మాట్లాడకపోవడం నారాయణకి ఈ అవకాశం కల్పించిందనుకోవాలి. నారాయణ విమర్శలను సానుకూల దృక్పదంతో స్వీకరించదలిస్తే పవన్ కళ్యాణ్ తన పూర్తి సమయాన్ని రాజకీయాలకు కేటాయించి ప్రజల తరపున పోరాడేందుకు సిద్దపడవలసి ఉంటుంది. లేకుంటే నారాయణ చెపుతున్నట్లు పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఎంత ప్రభావం చూపుతున్నప్పటికీ ఎప్పటికీ ఒక ఎక్స్ ట్రా ప్లేయర్ గానే మిగిలిపోతారు.