ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్టుల పయనం.. భిన్న కోణాల్లో సాగుతోంది. సీపీఐ యాంటీ జగన్ నినాదంతో దూసుకెళ్తుండగా.. సీపీఎం మాత్రం వైసీపీ నీడలో సేదదీరుతోంది. జగన్ నిర్ణయాల్ని సమర్థిస్తోంది. ఆ పార్టీకి వైసీపీ ఎక్కడా కనీస గౌరవం ఇచ్చినట్లుగా లేకపోయినా… సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాత్రం… జగన్మోహన్ రెడ్డిని ఆరాధానాభావంతో చూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏపీలో ఏ రాజకీయ పార్టీ కూడా సంతృప్తికరంగా లేదు. దాడులు, దౌర్జన్యాలు జరిగాయని ఆక్షేపించారు. అందుకే మళ్లీ మొదటి నుంచి ఎన్నికలు జరపాలని కోరుతున్నారు.
అయితే సీపీఎం మాత్రం సైలెంట్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు వైసీపీకి అనుకూలంగా వాదన వినిపించింది. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం తీసుకోవాలని.. అప్పుడే నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేదని ఇప్పటికే తేలిపోయింది. అమరావతి విషయంలోనూ సీపీఎం తీరు ఇలాగే ఉంది. ఆ పార్టీ నేత బాబూరావు చురుగ్గా రాజధాని అమరావతికి మద్దతుగా జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నారు. కానీ పార్టీ పరంగా మాత్రం మధు సైలెంట్‌గా ఉన్నారు. పార్టీ సమావేశాల్లో రాజధాని అంశాన్ని చర్చించనీయడం లేదంటున్నారు.
అలాగే కోర్టులపై జగన్ సర్కార్ చేస్తున్న యుద్ధానికి సీపీఎం మద్దతు పలుకుతోంది. సీపీఎం మీడియా కోర్టు ధిక్కారం అవుతుందని తెలిసి కూడా పెద్ద ఎత్తున జగ్న లేఖకు కవరేజీ ఇచ్చింది. ప్రభుత్వంపై పోరాడి ప్రజల్లో పట్టు సాధించాలి కానీ.. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలంటూ.. మధు వ్యవహరిస్తున్న తీరుపై పార్టీలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయనకు జగన్ తో వ్యక్తిగతంగా సత్సంబంధాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇలా అయితే కమ్యూనిస్టులు అంటే.. ఒక్క సీపీఐనే అన్న భావన కలుగుతుందన్న అభిప్రాయం కూడా రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.