వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు… చరిత్రలో తుగ్లక్ అనే చక్రవర్తి తీసుకుంటున్న నిర్ణయాల్లానే ఉన్నాయని చెబుతూ.. కొద్ది రోజులుగా.. ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు.. కమ్యూనిస్టు పార్టీల నేతలు.. మరింత ముందుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు తుగ్లక్ కన్నా మించిపోయాయని.. ఆయనను జగ్లక్ అని పేరు పెట్టడం మంచిదని అంటున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ… జగన్ తుగ్లక్ కాదని.. జగ్లక్ అని తేల్చి చెప్పారు. ఆయన ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని.. ప్రజలపై రుద్దాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగంలో రాజధానులు అనేదే లేకపోతే.. ఇడుపులపాయ నుంచే పరిపాలించాలని.. రామకృష్ణ జగన్‌కు సలహా ఇచ్చారు.
మూడు రాజధానులు, మండలి రద్దు సహా ప్రతి నిర్ణయం ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తను చెప్పినట్లుగా వినలేదని మండలిని రద్దు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఏపీ పేద రాష్ట్రం అయితే.. ఒక్క లాయర్‌కు ఐదు కోట్లు చెల్లించడం ఏమిటని ప్రశ్నించారు. ఇంత దారుణమైన ప్రజా వ్యతిరేక పాలన అందిస్తున్నప్పటికీ.. కేబినెట్లోని మంత్రులు ఎందుకు నోరు తెరవడం లేదని.. రామకృష్ణ ఆశ్చర్యపోయారు. వైఎస్ కేబినెట్లో ఉన్న సీనియర్లు ఆయనకే సలహాలు ఇచ్చారని.. ఇప్పుడు మాత్రం.. నోరు తెరవడం లేదన్నారు. ఇప్పటికైనా సీనియర్ మంత్రులు నోరు తెరవాలని.. సీపీఐ రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.
సొంత పార్టీలో ఎవరినీ నోరెత్తకుండా చేసిన.. జగన్మోహన్ రెడ్డి.. విపక్ష పార్టీల నేతల విమర్శలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అసలు లెక్కలోకి తీసుకోవడం లేదు. ప్రజాందోళనలను సైతం.. ఓ వర్గానికి.. ఓ పార్టీకి చెందినవిగా భావించి లైట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో.. విపక్షాలు మరింత పట్టుదలగా విమర్శలు చేస్తున్నాయి… కానీ వెనక్కి తగ్గడం లేదు. జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించడానికి వెనుకాడటం లేదు.