ఇష్టం వచ్చినట్లుగా ఇతరులను విమర్శించడం ఆ తర్వాత క్షమాపణ చెప్పడం సీపీఐ నేత నారాయణకు కామన్ అయిపోయింది. తాజాగా చిరంజీవి కూడా ఆయన క్షమాపణలు చెప్పారు. చిరంజీవిపై తాను చేసిన చిల్లర బేరగాడు విమర్శలపై తీవ్ర వ్యతిరేకత రావడం.. మెగా ఫ్యాన్స్ మండిపడటంతో ఆయన క్షమాపణలు చెప్పారు. మీడియా ముందు ఆయన చేతులు జోడించి కాపునాడు… చిరంజీవి అభిమానులకు సారీ చెప్పారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ..సహజమని.. తన వ్యాఖ్యలను కూడా ఆ కోణంలోనే చూడాలన్నారు. తన విమర్శలు మరీ దారుణంగా ఉంటే భాషాదోషంగా చూడాలన్నారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలన్నారు.
మోదీతో కలిసి అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణలో పాల్గొనడాన్ని సీపీఐ నారాయణ ఖండిస్తూ.. చిల్లర బేరగాడని మండిపడ్డారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకున్న ఆయనపై ఇలాంటి వ్యాక్యలు చేయడం తగదన్న విమర్సలు వచ్చాయి. నాగబాబు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇవి శృతి మించి బెదిరింపుల వరకూ రావడంతో నారాయణ వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది.
నారాయణ ఇలా చాలాసార్లు క్షమాపణలు చెప్పారు. గతంలో హైదరాబాద్ ఎన్ కౌంటర్పైనా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో సారీ చెప్పారు. ఓ సారి ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపైనా.. మరోసారి గీతారెడ్డిపైనా వ్యాఖ్యలు చేసి క్షమాపణలు చెప్పారు. ఆయన దూకుడుగా మాట్లాడటం.. ఆ తర్వాత క్షమాపణ చెప్పడం కామన్ అయిపోయింది.