సీపీఐ సీనియర్ నేత నారాయణ… ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాల మీద కస్సున లేచేవారు, చెవి కోసుకుంటా అంటూ సవాళ్లు చేసినవారు! కానీ, ఇకపై ఇలాంటి సవాళ్లు ఉండవా… హుజూర్ నగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో తెరాస – సీపీఐల మధ్య సంబంధాలు మారిపోయాయా? అంటే, అవుననే చెప్పాలి. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తెరాసకు మద్దతు ఇచ్చేందుకు సీపీఐ సిద్ధమైంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా ఆ పార్టీ చేసింది. అయితే, ఈ నేపథ్యంలో నారాయణ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
హుజూర్ నగర్లో సీపీఐ ఓట్లు చాలా కీలకం కాబట్టి, కాంగ్రెస్ పార్టీ నుంచీ తెరాస నుంచి తమకు పొత్తు ప్రతిపాదనలు వచ్చాయన్నారు నారాయణ. ప్రస్తుతం దాదాపు ఓ ఏడు వేల వరకూ ఓటు బ్యాంకు తమకు అక్కడ ఉందన్నారు. గతంలో కాంగ్రెస్ తో కలిసి పనిచేశాం కాబట్టి వాళ్లొచ్చి అడగడంలో వింత లేదనీ, కానీ తెరాస వాళ్లు రావడంతో అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారన్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరని నారాయణ చెప్పడం జరిగింది!! ఒకప్పుడు టీడీపీతో కొట్లాడామనీ, ఆ పార్టీతో కలిసి పనిచేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అలాగే కాంగ్రెస్ తో కూడా కొట్లాడిన సందర్భమూ ఉందీ, కలిసి పనిచేయాల్సిన అవసరమూ ఏర్పడిందన్నారు. అలాగే తెరాసతో కొట్లాడినం… ఇప్పుడు వాళ్లొచ్చి మద్దతు కోరారని నారాయణ అన్నారు. ఒక పార్టీతో మరో పార్టీకి ఉన్న విభేదాలు పర్మనెంట్ గా ఉండవన్నారు! ఈ ఒక్క సీటు ఓడిపోయినా తెరాసకు వచ్చిన నష్టం లేదనీ, ఈ ఒక్క సీటు గెలవడం వల్ల కాంగ్రెస్ కి కొత్తగా ఒరిగే లాభమూ ఏమీ లేదని చెప్పారు.
కొత్త పొత్తు పొడుపు నేపథ్యంలో నారాయణ మాట తీరు ఒక్కసారిగా మారిపోయింది. రాజకీయ శత్రుత్వాలపై సగటు నాయకులు చెప్పే నిర్వచనాన్ని వల్లె వేస్తున్నారు. ఇంకోటి… ఈ ఒక్క సీటు వల్ల కాంగ్రెస్, తెరాసలకు పెద్ద ఫరక్ పడదని అంటూ తెరాసకు మద్దతు ఇవ్వడం విశేషం. నిజానికి, ఈ ఒక్కసీటూ కాంగ్రెస్ గెలుచుకుంటూ ప్రతిపక్షాల వాయిస్ కి మరింత బలం వస్తుంది. ఇప్పటికే ప్రతిపక్షాల గొంతు నులిమే రీతిలోనే తెరాస చర్యలున్నాయి. అసెంబ్లీలో సీఎల్పీని విలీనం చేసేసుకుంది. ఇవన్నీ చూస్తూ… నిత్యం ప్రజల పక్షాన ఉంటామని చెప్పుకునే ఈ కమ్యూనిష్టు నాయకులు అధికార పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకోవడం… అది ఏ తరహా చర్యగా ఉందో వారికే అర్థం కావాలి! ముందుగా తెరాస మద్దతు కోరింది కాబట్టి వారికే సై అన్నామని మీడియాతో చాడా వెంకటరెడ్డి చెప్పారు. ఆ లెక్కన మొదట్నుంచీ… అంటే అసెంబ్లీ ఎన్నికల దగ్గర్నుంచీ కాంగ్రెస్ పొత్తులో ఉంది కదా! దాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు..?