ముద్రగడ పద్మనాభాన్ని వైకాపా శిఖండిలా ఉపయోగించుకొందని తెదేపా నేత ఒకరు ఆరోపించారు. ఇప్పుడు సిపిఐ నేత నారాయణ కూడా పవన్ కళ్యాణ్ న్ని ఉద్దేశ్యించి అదే మాట అన్నారు. తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ ని శిఖండిలాగ ఉపయోగించుకొంటోందని, చంద్రబాబు నాయుడుకి రాజకీయ ఇబ్బందులు తలెత్తినప్పుడల్లా అతనిని ముందుకు తీసుకువచ్చి నిలబెడుతుంటుందని నారాయణ ఎద్దేవా చేసారు. చంద్రబాబు నాయుడు పిలవగానే తెదేపాను సమస్యల నుండి బయటపడేయడానికి పవన్ కళ్యాణ్ పరుగున వస్తుంటాడని ఎద్దేవా చేసారు. కాపుల సమస్యను చంద్రబాబు నాయుడు పరిష్కరించకుండా రెండేళ్ళపాటు కాలక్షేపం చేయడం వలననే అది తుని విద్వంసానికి దారి తీసింది కనుక దానికి ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని నారాయణ అన్నారు. ముద్రగడ పద్మనాభంపై కూడా నారాయణ ఆసక్తికరమయిన వ్యాఖ్యలు చేసారు. ముద్రగడ తన భార్యను కూడా ఆమరణ నిరాహార దీక్షలో కూర్చోబెట్టడం గృహ హింసగా భావించాలని అన్నారు.
పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం నిర్వహించినప్పుడు ఒక విలేఖరి కూడా ఆయనని ఇదే ప్రశ్న అడిగాడు. చంద్రబాబు నాయుడు ఆపదలలో చిక్కుకొన్నపుడల్లా మీరు ఆపద్భాందవుడిలా ఎందుకు తరలివస్తున్నారని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ నేరుగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. ఆ తరువాత రామ్ గోపాల్ వర్మ కూడా పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ ‘మీరు జనసేన పార్టీ పెట్టినప్పుడు ఏమి చెప్పారు..ఇప్పుడు ఏవిధంగా వ్యహరిస్తున్నారో ఒకసారి ఆలోచించి చూసుకోమని’ కోరారు. అంటే రాజకీయాలలోకి ప్రవేశించిన తరువాత పవన్ కళ్యాణ్ కూడా సగటు రాజకీయ నేత మాదిరిగానే వ్యవహరిస్తున్నారని నారాయణ, రామ్ గోపాల్ వర్మల అభిప్రాయం కావచ్చును.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన తరువాత మొదట బీజేపీకి మాత్రమే మద్దతు ఇచ్చేందుకు సిద్దపడ్డారు. కానీ మోడీ సలహా మేరకు తెదేపాకు కూడా మద్దతు ఇవ్వడం మొదలుపెట్టారు. తాను వాటికి మద్దతు ఇస్తున్నప్పటికీ అవసరమయితే ప్రజల తరపున నిలబడి వాటిని ప్రశ్నిస్తానని ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆయన తెదేపాకు బేషరతుగా మద్దతు ఇస్తున్నారు. అందుకే ఇటువంటి విమర్శలు మూటగట్టుకోవలసి వస్తోంది.