హైదరాబాద్: సీపీఐ అగ్రనేత నారాయణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై, రాష్ట్ర మంత్రులపై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక మాఫియా అంతా చంద్రబాబునాయుడుకు తెలిసే జరుగుతోందని ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ మాఫియాలో ఉన్నారని అన్నారు. వీరంతా లక్షనుంచి 18 లక్షల దాకా గడిస్తున్నారని ఆరోపించారు. కోట్లు, కోటలు, కేసులతో చంద్రబాబు బిజీగా అయిపోయారని, ప్రభుత్వ పనిచేయటం లేదని అన్నారు. అభివృద్ధి కుంటుపడిందని దుయ్యబట్టారు. ఏపీకి ప్రత్యేక హోదాకోసం 7న ఢిల్లీలోని జంతర్ మంతర్లో భారీ స్థాయిలో ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. హోదా విషయంలో ఏపీ ప్రజలను కేంద్రం మభ్యపెడుతోందని, మోదీ, వెంకయ్య, చంద్రబాబు ప్రజలకు మూడు నామాలు పెడుతున్నారని మండిపడ్డారు.
సీపీఐ ఆంధ్రప్రదేశ్ శాఖ కార్యదర్శి రామకృష్ణ కూడా ఇసుక మాఫియాపై ఫైర్ అయ్యారు. ఏడాదికి రెండువేల కోట్లను ఇసుక మాఫియా కొల్లగొడుతూ రాష్ట్ర ఖజానాకు చిల్లు పెడుతుంటే, దానిని డ్వాక్రా సంఘాలపై నెట్టేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు. బాబుకు చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రంపై అఖిలపక్షంతో చర్చ పెట్టాలని, అందుకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. విభజన చట్టంలోని హామీలను తక్షణం నెరవేర్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాని చర్చలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా సాధనకోసం ఏడో తేదీన చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టామని చెప్పారు.