సీపీఐ సీనియర్ నేత నారాయణకు సీనియర్ హీరో నాగార్జునపై పట్టలేనంత కోపం వచ్చింది. సాధారణంగా రాజకీయ అంశాలపైనే రాజకీయ నేతలు స్పందిస్తూ ఉంటారు. కానీ సీపీఐ నేత నారాయణ మాత్రం దానికి భిన్నం. ఇతర అంశాలపైనా స్పందిస్తారు. అలాగే… బిగ్‌బాస్‌పై స్పందించారు. ఈ కార్యక్రమానికి ఆయన మొదటి నుంచి వ్యతిరేకమే కానీ.. తాజాగా… బిగ్‌బాస్‌లోని ఓ టాస్క్ ఆయనకు అస్సలు నచ్చలేదు. ఎంతగా నచ్చలేదంటే.. దానిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కోర్టులకు వెళ్లారు.. కానీ ఎవరూ తీసుకోలేదట… అందుకని ఆయన మీడియా ఎదుట నాగార్జునపై ఫైరవుతున్నారు.
ఇంతకీ ఆ టాస్కేమిటంటే… నాగార్జున ముగ్గురు అబ్బాయిల ఫోటోలు పెట్టి.. కంటెస్టెంట్‌ని ఎవరిని ప్రేమిస్తారు..ఎవర్ని ముద్దుపెట్టుకుంటావు.. ఎవర్ని పెళ్లాడతావు అని అడిగిన టాస్క్. నారాయణ ఉద్దేశం ప్రకారం.. అసలు అమ్మాయిని అలా అడగకూడదు. మనది పితృభూమి కాదని…మాతృభూమి అని ఆయన గుర్తు చేస్తున్నారు. నాగార్జున ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎవరితోనైనా అలా చేయగలరా అని ప్రశ్నల వర్షం కురిపించారు. నారాయణకు చాలా కోపం వచ్చిందని.. ఇలాంటి పోలిక తెచ్చినప్పుడే సులువుగా అర్థం అవుతుంది. అయితే అసలు షో అయిపోయిన తర్వాత నారాయణ ఎందుకు రచ్చ చేస్తున్నారో పెద్దగా క్లారిటీలేదు.
కమ్యూనిస్టులు .. అదీ కూడా నారాయణస్థానంలో ఉన్న వారు.. పూర్తిగా.. అభ్యుదయ వాదంపైనే దృష్టిపెడతారు. కానీ విచిత్రంగా నారాయణ… ఎప్పుడూ లేని విధంగా సంస్కృతి, సంప్రదాయాలు… మాతృస్వామ్య వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. ఇదేదో.. కమ్యూనిజం నుంచి దారి తప్పిన వ్యవహారంలా ఉందే.. అన్న డౌటనుమానం చాలా మందికి వస్తుంది. అయితే.. ఆయన అలాంటివేం పట్టించుకోరు. తాను అనుకున్నది తాను చేస్తూ ఉంటారు. అంటూ ఉంటారు.