కమ్యూనిస్టు పార్టీ నేత సీపీఐ నారాయణ స్టైలే వేరుగా ఉంటుంది. ఆయన ఏ ప్రకటన చేసినా… వివాదమో.. విశేషమో అయ్యే స్థాయి ఉంటుంది. సమకాలిన రాజకీయాల నుంచి బిగ్ బాస్ వరకూ ఆయన దేన్నీ వదిలి పెట్టరు. స్పందిస్తూనే ఉంటారు. అలాంటిది రామతీర్థం ఘటన గురించి స్పందించకుండా ఎలా ఉంటారు..? స్పందించారు. అయిత ేఇక్కడ ఆయన భక్తుల మనోభావాలు గట్రాల్లాంటివి పట్టించుకోకుండా.,. మరింత గాయపడేలా మాట్లాడారు. బొమ్మల తలలు పగలకొడితే ఇంత రాజకీయం చేస్తారా అని మండిపడ్డారు. అంటే.. ఆలయాల్లోని దేవుని ప్రతిమను.. సీపీఐ నారాయణ బొమ్మలుగా మాత్రమే పరిగణిస్తున్నారు.
ఈ దాడులకు రాజకీయం చేయడం సరి కాదని.. ఏపీలో లేని మత రాజకీయాలను తీసుకు వచస్తున్నారని ఆయన అంటున్నారు. ఆయన కోపం అంతా ఎందుకంటే.. రైతుల ఉద్యమాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదనే. రైతుల ఆందోళనను పక్కదారి పట్టించేందుకే.. 0బీజేపీ, ఆర్ఎస్ఎస్ మత సమస్యలను సృష్టిస్తున్నారని నారాయణ ఆరోపిస్తున్నారు. ఢిల్లీ శివార్లలో ఆందోళన చేస్తున్న రైతులు చలి వల్ల అనారోగ్యం వల్ల కొంత మంది చనిపోయారు. వారి గురించి మీడియాలో ఎక్కడా రావడం లేదు. అందుకే.. నారాయణకు కోపం వచ్చింది.
రైతులు మరణిస్తే పట్టించుకోరా? మీకు అసలు సిగ్గుందా అని ఆవేశ పడుతున్నారు. కమ్యూనిస్టు పార్టీల నేతలకు.. దేవుళ్లపై నమ్మకం ఉండదు. వారి నమ్మకాలు.. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ఉంటారు. వారు ఇలాంటి ప్రకటనలను అసువుగా చేస్తూంటారు. అయితే ఇటీవలి కాలంలో కమ్యూనిస్టు పార్టీల నేతలు కూడా.. భక్తి వైపు వెళ్తున్నారన్న ప్రచారం ఉంది. అందుకే.. కమ్యూనిస్టుల బలం తగ్గిపోతుందన్న చర్చ కూడా ఉంది.