తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ను బర్తరఫ్ చేయాలంటూ సీపీఐ నేత నారాయణ అదే పనిగా డిమాండ్ చేస్తూండటం.. దానికి అజయ్ కూడా ఘాటుగా రియాక్ట్ అవుతూండటం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వాగ్వాదానికి నేపధ్యం… గ్రేటర్ ఎన్నికల పోలింగ్ రోజు.. కూకట్ పల్లిలో జరిగిన ఘర్షణ. టీఆర్ఎస్ తరపున కూకట్ పల్లి ఇన్చార్జిగా వ్యవహరించిన అజయ్.. ఆ రోజున అక్కడ పర్యటించారు. ఆయన డబ్బులు పంచుతున్నారంటూ.. ఆయన కారుపై.. బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. అక్కడ రచ్చ రచ్చ అయింది. ఓ బాధ్యతయుతమైన మంత్రి పదవిలో ఉండి… డబ్బులు పంపిణీ చేయడం ఏమిటని.. అలాంటి మంత్రిని బర్తరఫ్ చేయాలని.. నారాయణ డిమాండ్ చే్శారు.
అయితే.. దాడి చేసింది బీజేపీ అయితే.. బీజేపీని అనకుండా.. తనను బర్తరఫ్ చేయాలని సీపీఐ నారాయణ డిమాండ్ చేయడంపై.. అజయ్‌కు మండిపోయింది. వెంటనే.. ఆయన నారాయణ బీజేపీలో చేరారేమో తెలియదు కానీ.. అక్కడేం జరిగిందో తెలియకుండా విమర్శించడం సరి కాదన్నారు. చికెన్ నారాయణ అంటూ ఎద్దేవా చేశారు. నారాయణపై ఘాటుగానే విమర్శలు చేశారు. ఇలా ప్రతి విమర్శలు చేయడంతో నారాయణ కూడా మళ్లీ వెంటనే స్పందించారు. అజయ్‌ను బర్తరఫ్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. వీరిద్దరి మధ్య గొడవలో పార్టీ మార్పు వ్యవహారాలు.. పాత గొడవలు బయటకు వచ్చాయి.
పువ్వాడ అజయ్.. సీపీఐ ప్రముఖ నేత పువ్వాడ నాగేశ్వరరావు కుమారుడు., అయితే ఆయన కమ్యూనిస్టు భావజాలంతో కాకుండా.. మొదట కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ నుంచే ఖమ్మం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత టీఆర్ఎస్లో చేరారు. అక్కడ్నుంచి మళ్లీ పోటీ చేసి గెలిచి మంత్రి పదవి పొందారు. ఈ విషయాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. తన తండ్రి అయిన పువ్వాడ నుంచి నారాయణ ఎంతో సాయం పొంది మోసం చేశారని.. తాను నోరు తెరిస్తే.. నారాయణ బాగోతం మొత్తం బయట పడుతుందని అజయ్ హెచ్చరించారు. మొత్తానికి ఎన్నికల్లో చాలా చోట్ల గొడవలు జరిగాయి. నారాయణ అజయ్ ను మాత్రమే టార్గెట్ చేయడం.. ఆయన కూడా అంతే స్థాయిలో రివర్స్ ఎటాక్ చేయడం వెనుక రాజకీయాలను మించిన కారణాలున్నాయన్న చర్చ మాత్రం నడుస్తోంది