హుజూర్ నగర్ ఉపఎన్నికలో సీపీఐ మద్దతు పొందిన టీఆర్ఎస్కు కాలం కలసి రావడం లేదు. ఆర్టీసీ కార్మికుల విషయంలో సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి కారణంగా… తాము మద్దతుపై పునరాలోచించుకుంటామంటూ… సీపీఐ తాజాగా ప్రకటించింది. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా జరిగిన అఖిలపక్ష సమావేశానికి సీపీఐ కూడా హాజరైంది. ఆర్టీసీ కార్మికుల విషయంలో కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలపై సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల తొలగింపు ప్రకటన వెనక్కి తీసుకోకుంటే.. హుజూర్నగర్ ఉపఎన్నికలో మద్దతుపై పునరాలోచన చేస్తామని చాడ వెంకట్రెడ్డి ప్రకటించారు. కేసీఆర్ వెంటనే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం దొరల రాజ్యం కాదన్నారు.
ఆర్టీసీ కార్మికులకు అండగా తెలంగాణ సమాజం ఉందన్నారు. నిజానికి టీఆర్ఎస్ కు.. సీపీఐ మద్దతు ఇవ్వాలని నిర్ణయించినప్పటి నుండి.. ఆ పార్టీ అన్ని వైపుల నుండి విమర్శలు ఎదుర్కొంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి మహాకూటమిగా పోటీ చేసిన సీపీఐ… హుజూర్ నగర్ లో పోటీ చేయకూడదనుకున్నప్పుడు.. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి కానీ… అడిగారని చెప్పి టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడమేమిటన్న ప్రశ్నలు బయటకు వచ్చాయి. అయితే… భవిష్యత్ రాజకీయాల కోసమే… మరో కారణమో కానీ. .. సీపీఐ టీఆర్ఎస్ కే మద్దతు ప్రకటించింది. అనూహ్యంగా… ఇప్పుడు ఆర్టీసీ అంశం తెరపైకి రావడం… కేసీఆర్ కార్మికుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తూండటంతో.. సీపీఐపై మరింత ఒత్తిడి పెరుగుతోంది.
కమ్యూనిస్టులు అంటే కార్మికుల పక్షాల పోరాడేవారు. ఇప్పుడు.. కార్మికులకే అన్యాయం జరుగుతూంటే… టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించడం మంచిది కాదంటున్నారు. దీంతో సీపీఐ పునరాలోచనలో పడింది. కార్మికుల విషయంలో టీఆర్ఎస్ సర్కార్ వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించకపోతూండటంతో… సీపీఐ మద్దతు ఉపసంహరణ నిర్ణయం తీసుకోవడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. హుజూర్ నగర్లో కమ్యూనిస్టులకు కొంత ఓటు బ్యాంక్ ఉంది.