సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను, పార్టీల తీరు తెన్నులను చాలా చక్కగా విశ్లేషించారు.
అధికార తెదేపా గురించి మాట్లాడుతూ “ఆ పార్టీ వైకాపా ఎమ్మెల్యేలను పార్టీలోకి రప్పించడం ద్వారా శాసనసభలో బలపడుతోంది కానీ సంతృప్తికరమయిన పాలన అందించలేకపోవడం చేత రోజురోజుకి ప్రజలలో దాని పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. ఆ కారణంగా అది ప్రజలలో బలహీనపడుతోంది,” అని అన్నారు. ఆయన చెప్పిన మాట అక్షరాల నిజమని అంగీకరించకతప్పదు. తెదేపాకు శాసనసభలో పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ అది వైకాపా ఎమ్మెల్యేలను కూడా పార్టీలో రప్పించుకొంటూ ఇంకా బలపడుతోంది. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన అనేక హామీల అమలు చేయకపోవడం వలన, రాష్ట్రంలో నానాటికి పెరిగిపోతున్న అవినీతి, అక్రమాల వలన తెదేపా ప్రభుత్వం చాలా వేగంగా ప్రజాదరణ కోల్పోతోంది. అయినా అది ఆత్మవంచన చేసుకోనేందుకే ఇష్టపడుతోంది తప్ప మేల్కొని నష్ట నివారణ చర్యలు చేపట్టడం లేదు. ఆ కారణంగా దానిపట్ల ప్రజలలో ఇంకా వ్యతిరేకత పెరుగుతోంది. అదే సంగతి రామకృష్ణ క్లుప్తంగా చెప్పారు.
వైకాపా గురించి ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయం కూడా సహేతుకంగానే ఉంది. “తెదేపా ప్రజలలో ఆదరణ కోల్పోతున్నా ఆ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి వినియోగించుకోలేకపోతున్నారు. ప్రజలని తనవైపు తిప్పుకోవడంలో విఫలమవుతున్నారు,” అని విమర్శించారు. అధికారంలో ఉన్న పార్టీ మీద సహజంగానే ప్రజలలో కొంత వ్యతిరేకత ఉంటుంది. పైన చెప్పుకొన్న కారణాల వలన అది ఇంకా పెరిగింది. జగన్ కాక మరొక నేత ఎవరయినా అయితే దీనినొక గొప్ప అవకాశంగా మలుచుకొని ప్రజలను తనవైపు తిప్పుకొనేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తారు. కానీ జగన్ ఎంతసేపు చంద్రబాబు నాయుడుని విమర్శించడానికి, ఆయన వ్యూహాల నుంచి పార్టీని, ఎమ్మెల్యే కాపాడుకోవడానికే పరిమితం అవుతున్నారు. కనుక జగన్ గురించి రామకృష్ణ వ్యక్తం చేసిన అభిప్రాయం కూడా సహేతుకంగానే ఉందని చెప్పవచ్చును.
విభజన సందర్భంగా ఇచ్చిన అన్ని హామీల అమలు కోసం చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు ఇప్పటికయినా గట్టిగా మాట్లాడాలని రామకృష్ణ కోరారు. రాష్ట్రంలో తెదేపా, వైకాపాలు రాజకీయాలను ఒక కార్పోరేట్ స్థాయికి తీసుకుపోయాయని ఆయన విమర్శించారు. అవి రాజకీయాలను కార్పోరేట్ స్థాయి రాజకీయ చదరంగంగా మార్చేసాయని, అందులో కోటీశ్వరులకి తప్ప సామాన్యులకి అవకాశం లేకుండా చేశాయని రామకృష్ణ విమర్శించారు. ఈ అభిప్రాయం కూడా అక్షరసత్యమని అందరికీ తెలుసు.
రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీల తీరు తెన్నుల గురించి కె. రామకృష్ణ చెపుతున్న అభిప్రాయాలు సహేతుకంగానే ఉన్నాయి. కానీ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నప్పుడు దానిని సిపిఐ ఎందుకు అందిపుచ్చుకోలేకపోతోంది? గత మూడు నాలుగు దశాబ్దాలుగా నిత్యం ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేస్తున్నప్పటికీ ఇంత వరకు ఒక్కసారి కూడా రాష్ట్రంలో కానీ కేంద్రంలోగానీ సిపిఐ అధికారంలోకి ఎందుకు రాలేకపోయింది? ఎప్పుడూ ఏదో ఒక ప్రధాన పార్టీకి తోక పార్టీగానే ఎందుకు మిగిలిపోతోంది? అనే ప్రశ్నలకు రామకృష్ణ జవాబు కనుగొంటే బాగుటుంది కదా?