అనుకున్నట్టుగానే జరిగింది! కార్మికులు కష్టాల్లో ఉంటే, ఆ కార్మికుల కోసమే పోరాటాలు చేసిన సీపీఐ చివరికి మంచి నిర్ణయమే తీసుకుందని చెప్పాలి. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ తెరాసకు మద్దతు ఇస్తున్నట్టుగా గతవారంలో ఆ పార్టీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ మీదున్న కోపంతో తెరాసకు సపోర్ట్ చేస్తున్నట్టు గతవారంలో చాడా వెంకట రెడ్డి చెప్పారు. నిజానికి, కమ్యూనిష్టులపై నానావిమర్శలు చేసిన కేసీఆర్ కి ఎలా మద్దతు ఇస్తారూ, చేజేతులా పార్టీని ఉనికి కోల్పోయేట్టు వ్యవహరిస్తున్నారంటూ సీపీఐ తీరు మీద చాలా విమర్శలు వినిపించాయి. ఆ తరువాత, ఆర్టీసీ కార్మికుల సమ్మె తెర మీదికి వచ్చింది. దీంతో హుజూర్ నగర్లో తెరాసకి ఇచ్చిన మద్దతుపై సీపీఐ పునరాలోచించాల్సిన అవసరం ఏర్పడింది. చివరికి ఆ పార్టీకి మద్దతును ఉపసంహరించుకుంటున్నట్టుగా చాడా వెంకట రెడ్డి ప్రకటించారు.
ఆర్టీసీ పట్ల కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి మీద విముఖత తెలుపుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వెంకటరెడ్డి చెప్పారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా హుజూర్ నగర్లో తెరాసకి మద్దతు ఇవ్వాలని అనుకున్నామనీ, అప్పటికి ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలుకాలేదని గుర్తుచేశారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకూ ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని సూచించారు. ఇప్పటికీ రెచ్చగొట్టే ధోరణిలోనే కేసీఆర్ వ్యవహరిస్తున్నారని చాడ అన్నారు.
సీపీఐ మద్దతు ఉపసంహరించుకోవడం ఈ సమయంలో తెరాసకు ఎదురుదెబ్బే! ఎందుకంటే, హుజూర్ నగర్లో సొంతంగా గెలుపుపై తెరాసకి నమ్మకం లేకనే సీపీఐ ఓటు బ్యాంకుపై ఆధారపడాలనుకుంది. దాదాపు పదివేల ఓటు బ్యాంకు తమకు కలిసొస్తుందీ, కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిని ఓడించడం ఈజీ అనుకుని లెక్కలేసుకున్నారు. కానీ, ఇప్పుడు సీపీఐ పక్కకి తప్పుకుంది! ఇప్పటికే ఆర్టీసీ కార్మికుల వ్యవహారంలో ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో హుజూర్ నగర్ ఉప ఎన్నికను కూడా చేజార్చుకుంటే.. తెరాసకు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితే ఎదురౌతుంది. సీపీఐ తాజా నిర్ణయంతో హుజూర్ నగర్లో కాంగ్రెస్ కి మరింత కొత్త ఉత్సాహం వచ్చినట్టే. అయితే, తెరాసకు దూరమైన సీపీఐ… కాంగ్రెస్ కి మద్దతు ఇస్తుందా అనే చర్చా ఇంకా మిగులుంది! ఎందుకంటే, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తమకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నదనే కదా కారణంగా చూపించి తెరాసకు మద్దతు అన్నారు. ఈ అవకాశాన్ని కాంగ్రెస్ వాడుకోవాలి. సీపీఐ మద్దతు కోరేందుకు ప్రయత్నం జరిగే అవకాశాలున్నాయి.