హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి చెందిన సీమాంధ్ర ఎంపీలు వర్సెస్ పవన్ కళ్యాణ్ వ్యవహారంలో సీపీఐ, వైసీపీ పార్టీలు పవన్ను సమర్థించాయి. సీపీఐ ఆంధ్రప్రదేశ్ శాఖ నేత రామకృష్ణ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేకహోదాకోసం పవన్ కళ్యాణ్ పిలుపునిస్తే అతనిపైన తెలుగుదేశం పార్టీ నేతలు ఎదురుదాడికి దిగటం సరికాదని అన్నారు. ప్రత్యేక హోదాను సాధించి చూపించాలని, లేకుంటే పదవులకు రాజీనామా చేయాలని సూచించారు. చిత్తూరు నాయుడు, నెల్లూరు నాయుడులను ప్రత్యేకహోదాపైన నిలదీయాలని అన్నారు. పవన్ ట్వీట్లతో సరిపుచ్చటంకాదని, తమతో కలిసి పోరాడాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో సెక్షన్ 8 అమలు చేసినా, చేయకపోయినా ప్రజలకు వచ్చిన నష్టమేమీ ఉండదని చెప్పారు. రాజకీయ స్వప్రయోజనాలకోసమే కేసీఆర్, చంద్రబాబు సెక్షన్ 8పై రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. మరోవైపు వైసీపీ నేతలు ఇదే విషయంపై టీడీపీ నేతలను దుమ్మెత్తిపోశారు. ఎన్నికలనాడు పవన్ కాళ్ళు పట్టుకున్న టీడీపీ నేతలు ఇప్పుడు జుట్టు పట్టుకుంటున్నారని విమర్శించారు. టీడీపీని విమర్శిస్తే టీఆర్ఎస్తో కుమ్మక్కయినట్లని ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ను, ఇప్పుడు పవన్ను వాడుకుని వదిలేస్తున్నారని వైసీపీ నేతలుఆరోపించారు.