మార్కిస్టు కమ్యూనిస్టుల నాయకత్వం కేరళకు చెందిన పార్టీ నాయకుని చేతికి వెళ్లింది. ఎం ఏ బేబీ అనే నాయకుడు ఇక నుంచి సీపీఎంకు ప్రధాన కార్యదర్శిగా నేతృత్వం వహిస్తారు. సీతారాం ఏచూరి చనిపోయినప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంది. ఇప్పుడు ఆ పోస్టును భర్తీ చేసుకున్నారు. ఎం ఏ బేబీ అనే నేత కేరళ మాజీ మంత్రి, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కోసం తెలుగు రాష్ట్రాలకు చెందిన బీవీ రాఘవులు కూడా ప్రయత్నించారు కానీ ఆయనకు అవకాశం దక్కలేదు.
రాష్ట్రాల్లో ఎలా అయితే కింది స్థాయి నాయకత్వాన్ని ఎదగనివ్వకుండా.. కొంత మంది గుప్పిట్లోనే ఉందో.. జాతీయ స్థాయిలోనూ అదే రాజకీయం చేయడంతో ఇప్పుడు సీపీఎంకు సారధ్యం వహించేందుకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నేత లభించలేదు. చివరికి కేరళకు మాత్రమే తెలిసిన నేతను ఎంపిక చేసుకోవాల్సిన వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీల్లో నారాయణ, రాఘవులు మాత్రమే కనిపించేవారు. ఇప్పటికీ ఆ పార్టీలకు ఇతరులు నాయకత్వం వహిస్తున్నా వారెవరో చాలా మందికి తెలియదు. వీరు ఇతర నాయకత్వాన్ని ఎదగనివ్వకపోవడంతో ప్రత్యామ్నా య నాయకత్వం రూపుదిద్దుకోలేదు.
జాతీయ స్థాయిలో కారాత్, ఏచూరి వంటి వారు మాత్రమే పెత్తనం చేశారు. వారికి ప్రత్యామ్నాయంగా నేతలు ఎదగలేదు. చివరికి సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసిన ఎంఏ బేబీని ఇప్పటి వరకూ కనీసం తమ భవిష్యత్ జాతీయ నేతగా ఫోకస్ చేయలేదు. ఇలాంటి అవకాశాలు ఉన్న పది మందిని.. జాతీయస్థాయిలో ఫోకస్ చేసి ఉంటే.. వారు సీపీఎంకు భవిష్యత్ నేతలుగా ఉండేవారు. ఇప్పుడు బేబీ ఘనచరిత్ర ఉన్న సీపీఎంను ఎలా నడిపిస్తారో చూడాల్సి ఉంది.
ఘన చరిత్ర ఉన్న సీపీఎంకు ఇప్పుడు కేరళ ఒక్కటే ఊపిరి పోస్తోంది. బెంగాల్, త్రిపుర వంటి రాష్ట్రాల్లోనూ పునాదులు కదిలిపోయాయి.