ప్రస్తుతం ఏపి రాష్ట్ర రాజకీయాలలో వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాలో చేరుతుండటం గురించే ప్రధానంగా చర్చ జరుగుతోంది. నిత్యం ఒకరో ఇద్దరో వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాలో చేరుతున్నట్లో లేదా వారిని చేర్చడానికి తెదేపా నేతలు తెరవెనుక చేస్తున్న కృషి గురించో ప్రధానంగా చర్చ జరుగుతోంది. మీడియాలో కూడా దీనికి సంబంధించిన వార్తలే ఎక్కువగా వస్తున్నాయి. ఆ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలని గాలికొదిలి పార్టీ ఫిరాయింపులపైనే ఎక్కువ దృష్టి పెడుతోందనే భావన ప్రజలలో ఏర్పడింది.
ఈసారి వేసవి తీవ్రత చాలా ఎక్కువగా ఎండటంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కరువు పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అనేక గ్రామాలలో, పట్టణాలలో ప్రజలు త్రాగడానికి మంచి నీళ్ళు కూడా దొరక్క అల్లాడుతున్నారు. నోరున్న మనుషుల పరిస్థితే ఈవిధంగా ఉంటే ఇంకా నోరులేని మూగజీవులు ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పక్షులు వంటివాటి పరిస్థితి ఎలాగా ఉంటుందో ఊహించుకోవచ్చు. చాలా గ్రామాలలో పశువులకు గడ్డి, మంచి నీళ్ళు కూడా దొరకడం లేదు.
ఈ సమస్యలపై ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకొంటోందని సి.పి.ఎం. రాష్ట్ర కార్యదర్శి పి. మధు ప్రశ్నించారు. ఆయన నిన్న తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రం కరువుతో అల్లాడుతుంటే, త్రాగడానికి మంచి నీళ్ళు దొరకక ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం వైకాపా ఎమ్మెల్యేలను ఏవిధంగా పార్టీలోకి రప్పించుకోవాలా? అని ఆలోచిస్తోంది. అనేక గ్రామాలలో చాలా దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇకనయినా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని రాష్ట్రంలో ప్రజలకు మంచి నీళ్ళు, పశువులకు పశుగ్రాసం అందించేందుకు యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టాలి,” అని కోరారు.
ప్రభుత్వం అంటే కేవలం ముఖ్యమంత్రి అనే భావన సర్వత్రా నెలకొని ఉంది. ఆ కారణంగా ఏ సమస్యనయినా ఆయనే పరిష్కరించాలి తప్ప తాము కాదని మంత్రులు కూడా భావిస్తున్నట్లున్నారు. అందుకే ఇటువంటి విమర్శలు వినపడుతుంటాయి. మంత్రులు అందరూ తమ తమ మంత్రిత్వ శాఖలను సమర్ధంగా నిర్వహించినట్లయితే, ఇటువంటి సమస్యలను చాలా వరకు అవలీలగా పరిష్కరించవచ్చు. కానీ మధు ఆరోపిస్తున్నట్లుగా ప్రస్తుతం అందరి దృష్టి వైకాపా ఎమ్మెల్యేలను తెదేపాలోకి రప్పించడంపైనే ఉన్నట్లుంది. ఒక్కొక్కరు ఎంతమంది వైకాపా ఎమ్మెల్యేలను పార్టీలోకి రప్పిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద అంతమంచి పేరు పొందవచ్చు అన్నట్లుగా ఉంది. ఇటువంటి విపత్కర పరిస్థితులలో మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ కలిసి ఈ నీటి కరువు, పశుగ్రాసం కరువు సమస్యలను పరిష్కరించడం అత్యవసరం.
మహారాష్ట్రాలో లాతూర్ లో ఇటువంటి కరువు పరిస్థితే ఏర్పడితే అక్కడి ప్రభుత్వం వెంటనే మేల్కొని రైల్వే వేగన్ల ద్వారా మంచి ఈళ్ళు తెప్పించి ప్రజలకు అందజేస్తోంది. కనుక రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు కూడా ఈ కరువు సమస్యను ఎదుర్కొనేందుకు తక్షణ చర్యలు చేపట్టడం మంచిది.