జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ ఎన్నికలపై దృష్టి పెట్టారు. కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి.. ప్రచార బరిలోకి కూడా దిగిపోయారు. విపక్ష పార్టీలు.. పొత్తుల సన్నాహాల్లో ఉన్నాయి. అందర్నీ ఏక తాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే “బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ” పేరుతో ప్రత్యేకంగా కూటమి పెట్టుకున్న సీపీఎం.. మాత్రం.. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఏర్పడిన కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఆ పార్టీ పవన్ కల్యాణ్ జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికల సముద్రాన్ని ఈదాలని ప్రయత్నిస్తోంది. నేరుగా కలిసే అవకాశం రాలేదమో కానీ.. గత నెలలోనే జనసేన అధినేతకు లేఖ రాశామని..సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మీడియాకు తెలియజేశారు. ఆ తర్వాత పొత్తుల విషయంలో రెండు పార్టీల మధ్య చర్చలు జరిగాయి.
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ, తమ్మినేని వీరభద్రంతో గత వారం చర్చించింది. ఆ చర్చల వివరాలను.. పవన్ కల్యాణ్‌కు ఆదివారం వివరించారు.. రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు. చర్చలు ఫలవంతంగా జరిగాయని.. తదుపరి చర్చల్లో పవన్ కల్యాణ్ పాల్గొనాలని సూచించారు. దానికి పవన్ కల్యాణ్ అంగీకరించారు. ఈ మేరకు సీపీఎంకు సమాచారం అందించాలని ఆదేశించారు. దాంతో.. మంగళవారం లేదా బుధవారం.. సీపీఎం తెలగాణ నేతలు .. పవన్ కల్యాణ్‌తో సమావేశమయ్యే అవకాశం ఉంది. అప్పుడే పొత్తులు ఖారారు చేసుకున్నట్లు ప్రకటన చేసే అవకాశం ఉందని జనసేన, సీపీఎం వర్గాలు చెబుతున్నాయి. జనసేనతో పొత్తు విషయంలో సీపీఎంలో ఏకాభిప్రాయం లేదన్న వాదన వినిపిస్తోంది. ఒక్క తమ్మినేని వీరభద్రం మాత్రమే.. ఆసక్తి చూపిస్తున్నారని… చెబుతున్నారు. మిగతా నేతలంతా.. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఏర్పడే మహాకూటమిలో భాగం కావాలని ఒత్తిడి చేస్తున్నట్లు చెబుతున్నాయి.
అయితే కాంగ్రెస్ పార్టీతో కలవకూడదన్నది.. సీపీఎం జాతీయ విధానం. ఆ విధానం మేరకు..తెలంగాణలో కాంగ్రెస్ ఉన్న కూటమిలో చేరకూడదని.. వీరభద్రం వాదిస్తున్నారు. అయితే… కూటమిలో కాంగ్రెస్ పెద్ద పార్టీయే కానీ… నేరుగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం కాదని..చెబుతున్నారు. పవన్ కల్యాణ్ తెలంగాణలో పోటీ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? పోటీ చేస్తే..ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు..? అన్నదానిపై క్లారిటీ వస్తే.. సీపీఎంతో పొత్తు వ్యవహారాలపైనా…స్పష్టత వచ్చే అవకాశంఉంది. పార్టీ పెట్టిన తర్వాత పవన్ కల్యాణ్ ఇంత వరకూ.. తెలంగాణలో జనసేనకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేకపోయారు. దీంతో అసలు జనసేన తెలంగాణలో పోటీ చేసే ఉద్దేశంలో లేదన్న ప్రచారం కూడా జరుగుతోంది. బేషరతుగా సీపీఎంకు మద్దతు ప్రకటించే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ఏం జరుగుతుందన్నదానిపై… బుధవారంలోగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.